Chandrababu

Chandrababu: గురువులపై దాడులు చేస్తే బట్టలు ఊడదీసి నిలబెడతాం..!

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ చేస్తోన్న ఆరోపణలు, విజయవాడ శాప్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం (సెప్టెంబర్ 21) కుప్పం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. మీడియా ముసుగులో వచ్చి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, బట్టలు ఊడదీసి నిలబెడతామని ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

14 సార్లు పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించిన చరిత్ర మాది..

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై గొడ్డలి పార్టీ విషం చిమ్ముతోంది. గత వైసీపీ పాలనలో నిర్వహించిన క్రీడల సర్టిఫికెట్లను కూడా ఇప్పుడు వాళ్లే ఫేక్ అంటున్నారు. గొడ్డలి పార్టీ అధినేత ఫేక్ కాబట్టి.. అందరినీ ఫేక్ అనడం ఇదెక్కడి న్యాయం? అని చంద్రబాబు నిలదీశారు.
తమ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవినీతికి తావులేదని.. 14 సార్లు డీఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశారు. 355 కోర్టు పిటిషన్లతో అడ్డంకులు సృష్టించినా చట్టబద్ధంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు.
ఆర్మీ సైనికుడికి అవమానం – ఉపాధ్యాయులపై దాడి..
విజయవాడలో గురువులపై వైసీపీ రౌడీలు దాడులు చేశారని మండిపడ్డారు. దేశ రక్షణలో పనిచేసిన మాజీ ఆర్మీ సైనికుడికి కుప్పంలో ఉద్యోగం వస్తే, పాఠశాల నుంచి బయటకు పిలిచి సాక్షి రిపోర్టర్ అవమానించే స్థాయికి దిగజారారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీపై చర్చించే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని, సాక్ష్యాధారాలతో సమాధానం చెబుతామని సవాల్ విసిరారు..

కుప్పంలో అభివృద్ధి పనుల జైత్రయాత్ర..

కుప్పం పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు పలు పరిపాలనా, విద్యా, పర్యావరణ మౌలిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు..
  • పరిపాలనా భవనాలు: రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ (RDO), ఏఎస్పీ (ASP) నూతన కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
  • సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ: రూ. 3.30 కోట్లతో నిర్మించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్, మెటీరియల్ రికవరీ సెంటర్‌ను ప్రారంభించారు. 82 ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా చెత్త నుంచి ఎరువు తయారు చేస్తూ నియోజకవర్గాన్ని ‘నెట్ జీరో’ లక్ష్యం దిశగా నడిపిస్తున్నామన్నారు.
  • విద్యా & విద్యుత్: 10 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2.70 కోట్లతో నిర్మించనున్న మల్లనూర్ జూనియర్ కళాశాల పనులకు భూమిపూజ చేశారు. రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 15 మెగావాట్ల పీఎం-కుసుమ్ (PM-KUSUM) సోలార్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

పీ4 విధానం, సంజీవని ప్రాజెక్ట్ & భూ సమస్యల పరిష్కారం..

  • 8,904 బంగారు కుటుంబాలు: కుప్పంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు పీ4 (P4) విధానం ద్వారా 8,904 నిరుపేద కుటుంబాలను దత్తత తరహాలో ఆదుకుని ఆర్థిక సాధికారత కల్పిస్తున్నామని తెలిపారు.
  • డిజిటల్ హెల్త్ రికార్డులు (సంజీవని): కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్‌గా 1.29 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందించామని, ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేస్తామని వెల్లడించారు.
  • కంగుంది భూ సమస్యకు పరిష్కారం: దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కంగుంది భూ సమస్యను పరిష్కరించి 320 మందికి రాజముద్రతో కూడిన ఇళ్ల పట్టాలను అందజేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *