Actor Radha

Actor Radha: బ్లాంక్ చెక్కులతో రూ.46 కోట్లకు స్కెచ్.. సోదరి అంబిక, సోదరుడు మల్లికార్జున్‌లపై నటి రాధ కేసు..!

Actor Radha: అలనాటి మేటి తారలు, ఒకప్పటి స్టార్ హీరోయిన్లు అయిన సోదరీమణులు రాధ (Radha), అంబిక (Ambika)ల మధ్య ఆస్తి, ఆర్థిక వివాదాలు తీవ్రరూపం దాల్చాయి. తన సొంత అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌లపై నటి రాధ గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌కు సెప్టెంబర్ 21న అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. తాను సంతకం చేసి ఇంట్లో ఉంచిన పాత ఖాళీ చెక్కులను చోరీ చేసి, ఏకంగా రూ. 46 కోట్లు క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నించారని, అంతేకాకుండా తన సొంత ఆస్తిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని రాధ ఆరోపించడం సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
వ్యాపార ఖర్చుల కోసం సంతకం చేసిన చెక్కులు..
చెన్నైలోని తన నివాసంలో వ్యాపార లావాదేవీల నిమిత్తం ఐడీబీఐ (IDBI) బ్యాంక్ కరెంట్ అకౌంట్‌ను నిర్వహిస్తున్నట్లు రాధ తెలిపారు. తాను ఊర్లో లేని సమయాల్లో పన్నులు, కరెంట్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు, గార్డెన్ నిర్వహణ ఖర్చుల చెల్లింపుల కోసం ముందుగానే సంతకం చేసి ఉంచిన కొన్ని ఖాళీ చెక్కులను తన గదిలో భద్రపరిచారు.
వ్యాపారం పేరు మార్పు – మర్చిపోయిన పాత చెక్కులు..
మొదట్లో ఈ ఖాతా ‘ARS గార్డెన్ స్టూడియో’ పేరిట ఉండేదని, జనవరి 2025లో వ్యాపారం పేరును ‘RR గార్డెన్స్’గా మార్చి కొత్త చెక్ బుక్ తీసుకున్న తర్వాత పాత చెక్కుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. అయితే గదిలో ఉండిపోయిన పాత ఖాళీ చెక్కుల విషయాన్ని తాను మర్చిపోయానని వివరించారు.
సెప్టెంబర్ 17న బ్యాంక్ నుంచి వచ్చిన అలర్ట్..
సెప్టెంబర్ 17న అంబిక పేరు మీద సుమారు రూ. 46 కోట్ల విలువైన 5 పాత చెక్కులు నగదు విత్‌డ్రా కోసం బ్యాంక్‌కు సమర్పించబడినట్లు ఐడీబీఐ బ్యాంక్ అధికారులు రాధకు సమాచారం ఇచ్చారు.
ఈ విషయం తెలియగానే రాధ తీవ్ర దిగ్భ్రాంతికి గురై వెంటనే బ్యాంక్‌కు వెళ్లి ‘స్టాప్ పేమెంట్’ (చెల్లింపుల నిలిపివేత) ఆదేశాలు జారీ చేశారు. అంబికకు అంత భారీ మొత్తం చెల్లించాల్సిన అవసరం వచ్చేలా ఆమెతో ఎలాంటి ఆర్థిక ఒప్పందాలు లేవని, ఆ చెక్కులను తాను ఎప్పుడూ ఇవ్వలేదని తేల్చిచెప్పారు.
చెక్కులు రాసింది సోదరుడే..
తాను చెన్నైలో లేని సమయంలో తన గదిలోకి అక్రమంగా ప్రవేశించి ఆ చెక్కులను తీసుకున్నారని, వాటిపై వివరాలను తన సోదరుడు మల్లికార్జున్ రాశాడని రాధ ఆరోపించారు. అంబిక, మల్లికార్జున్ ఇద్దరూ కుమ్మక్కై అక్రమంగా ఆర్థిక లబ్ధి పొందేందుకే ఈ దురాగతానికి ఒడిగట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏడాదిన్నరగా ఆస్తిలోకి అనుమతించట్లేదు..
గత ఏడాదిన్నర కాలంగా తన ఆస్తిలోకి వెళ్లకుండా వారు అడ్డుకుంటున్నారని రాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంగణంలోనే తన విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలు, ఇతర కీలక రికార్డులు ఉన్నాయని ఆమె వెల్లడించారు.
క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి..
తన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నేరం రుజువైతే అంబిక, మల్లికార్జున్‌లపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెన్నై పోలీస్ కమిషనర్‌ను ఆమె కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు.

దక్షిణాది సినీ చరిత్రలో స్టార్ సిస్టర్స్..

  • రాధ 1981లో భారతీరాజా చిత్రం ‘అలైగల్ ఓయివదిల్లై’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి, 1980వ దశకంలో రజనీకాంత్, కమల్ హాసన్, శివాజీ గణేశన్, కార్తీక్, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర నటుల సరసన హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు.
  • ఆమె అక్క అంబిక కూడా మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్‌గా అనేక సూపర్ హిట్ సినిమాలో నటించారు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకుని అప్పట్లో అగ్ర సోదరీమణులుగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అలాంటి ప్రముఖ తారల మధ్య రూ. 46 కోట్ల వివాదం పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *