KTR: 9 టీఎంసీలున్నా సాగునీరివ్వరా?.. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది!

KTR: పంటలు ఎండిపోతుంటే జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని రైతుల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలు, అన్నదాతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. జూరాల ప్రాజెక్టు వద్ద నిరసనకు దిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలతో పాటు వందలాది మంది రైతులను ముందస్తుగా నిర్బంధించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రాక్షస మనస్తత్వానికి’ పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు కేటీఆర్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

9 టీఎంసీల నీళ్లున్నా ఎందుకు ఇవ్వడం లేదు?

జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం ఏకంగా 9 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పటికీ, ప్రభుత్వం కుంటిసాకులతో గేట్లు ఎత్తకుండా మొండికేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. తాగునీటి అవసరాలకు కేవలం 2 టీఎంసీల నీరు సరిపోతుందని, మిగిలిన నీటిని విడుదల చేసి ఎండిపోతున్న ఆయకట్టు పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. కళ్లముందే పంటలు ఎండిపోయి అల్లాడుతున్న రైతులను ఆదుకోవాల్సిన సర్కారు, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అక్రమ నిర్బంధాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
గేట్లు ఎత్తబోయిన రైతులపై అక్రమ కేసులు – ఇదేం న్యాయం?
పంటలను కాపాడుకోవాలనే ఏకైక తపనతో గుండెపగిలిన రైతులు జూరాల గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తే, వారిపై అక్రమ కేసులు బనాయించడం క్షమించరాని నేరమని కేటీఆర్ విమర్శించారు. రైతులు ప్రాజెక్టు వద్దకు రాకుండా రోడ్లపై బారికేడ్లు పెట్టి, భారీగా పోలీసులను మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే విడుదల చేయాలి – నీళ్లు ఇవ్వకపోతే సర్కారు కూలిపోతుంది

అరెస్టు చేసిన మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, రైతులను ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తక్షణమే జూరాల నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసి పంటలను రక్షించాలని, లేనిపక్షంలో అన్నదాతల కడుపు మంట, తీవ్ర ఆగ్రహం దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *