Nadendla Manohar: అసెంబ్లీ ఎన్నికల్లో 21కి 21 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించాం.. సరిగ్గా అదే ఊపును రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చూపించాలి అన్ని నాదెండ్ల మనోహర్. విశాఖపట్నంలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కార్యకర్తల్లో నింపిన జోష్ ఇది. గెలుపు మత్తులో విశ్రమించకుండా, ప్రజల కష్టసుఖాల్లో తోడుంటూ గ్రామ స్థాయి నుంచి పార్టీ జెండాను మరింత బలంగా ఎగరేయాలని జనసైనికులకు ఆయన స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇచ్చారు.
విశాఖలోని సాగరమాల కన్వెన్షన్‌లో శనివారం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ భేటీకి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథిగా హాజరైన నాదెండ్ల మనోహర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ప్రజల కోసమే మన రాజకీయం..
గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన 100% సక్సెస్ రేట్ దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనమని నాదెండ్ల గుర్తుచేశారు. అదే విజయ పరంపరను రాబోయే పంచాయతీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని, పోటీ చేసే ప్రతి చోటా విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ, పార్టీ నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. క్రమశిక్షణ, ఐక్యతలే జనసేనకు అసలైన బలం అని.. నాయకులు, కార్యకర్తలు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రతి గడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తించి, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాటిని పరిష్కరించే నాయకులుగా ఎదగాలని కోరారు.
క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత – నేతల ఐక్యత..
ఈ సమావేశంలో విశాఖ రూరల్ అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబుతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని కీలక నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, కార్పొరేటర్లు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేకించి పార్టీ వెన్నెముకగా నిలుస్తున్న వీర మహిళలు, జనసైనికుల కష్టాన్ని గుర్తించి వారికి పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటాయని నాదెండ్ల భరోసా ఇచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది వంటివని, వార్డులు, గ్రామాల స్థాయిలో ఇప్పుడే కమిటీలను పటిష్టం చేసుకుని నిత్యం ప్రజల్లో ఉండాలని ఈ సమావేశం ముక్తకంఠంతో పిలుపునిచ్చింది.
