Harish Rao: తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, 6 గ్యారంటీల అమలుపై నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక సీఎం రేవంత్ రెడ్డి బురద రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ వేదికగా రేవంత్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేసిన ఆయన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పక్కా ప్లాన్ ప్రకారమే కుట్రపూరితంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు.
రాహుల్ టీషర్ట్ వేసుకుంటే తప్పులేదు.. మేం వేసుకుంటే సస్పెన్షనా?
లోక్‌సభలో రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని, నల్ల చొక్కాతో నిరసన తెలిపితే సరైనదేనన్న కాంగ్రెస్.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై టీషర్టులు వేసుకొచ్చి నిరసన తెలిపిన తమను సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
తమ టీషర్టులపై ఎలాంటి అసభ్య పదాలు లేవని, ‘6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది’ అని రాసుకున్నామని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి, ప్రభుత్వ వైఫల్యాలు, కుంభకోణాలను ఎక్కడ బయటపెడతామోనన్న భయంతోనే తమను సభ నుంచి బయటకు పంపారని మండిపడ్డారు. అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే తక్షణమే సభకు వచ్చి ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు.
22ఏ రగడ – సీఎం ఇంటిని రాత్రికి రాత్రే తొలగించారు!
3 లక్షల ఎకరాల్లో ఉన్న 22ఏ సమస్య కాస్తా 30 లక్షల ఎకరాలకు పాకిందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అంగీకరించారని, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక్క ఎకరం ఎఫెక్ట్ అయినా వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయని గుర్తుచేశారు.
రాత్రికి రాత్రే సీఎం ఇంటి తొలగింపు..
“సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని రాత్రికి రాత్రే 22ఏ నిషేధిత జాబితా నుంచి ఎలాగైతే తొలగించారో.. అలాగే సామాన్య ప్రజల భూములను కూడా వెంటనే తొలగించాలి. సీఎం ఇంటిని తొలగించినందుకు మాకేం ఈర్ష్య లేదు కానీ.. ప్రజల భూములను 22ఏలో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నందుకే మా పోరాటం” అని హరీష్ రావు తేల్చిచెప్పారు.
అధికారులపై చర్యలేవి?
అధికారులు చూడకుండా దబా దబా సంతకాలు పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రేవంత్ చెబుతున్నారని, మరి అలాంటి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
‘భూభారతి’ కాదు.. ‘భూహారతి’ – 9,200 లావాదేవీల్లో అవకతవకలు..
భూముల బదిలీ స్కామ్:
ప్రభుత్వం తెచ్చిన విధానం భూభారతి కాదని, ప్రజల ఆస్తులను కొల్లగొట్టే ‘భూహారతి’గా మారిందని విమర్శించారు. భూభారతిలో ప్రజలకు తెలియకుండానే 9,200 మంది భూములను బదలాయించారని, భారీగా చలాన్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించడం లేదని నిలదీశారు.
మా హయాంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి:
బీఆర్ఎస్ హయాంలో సజావుగా జరిగిన రిజిస్ట్రేషన్లు కాంగ్రెస్ రాగానే ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. “రేవంత్ రెడ్డి వస్తారో.. పొంగులేటి వస్తారో రండి.. ప్రజల వద్దకే వెళ్లి తేల్చుకుందాం. మాది తప్పయితే ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం” అని సవాల్ చేశారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై మాట మార్చిన రేవంత్ – సిట్టింగ్ జడ్జితో విచారణకు రెడీయా?
అఫిడవిట్లో ఉన్నవే అసెంబ్లీలో చెప్పారు:
తాము ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలనే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపించారని, అందులో కొత్తగా ఆయన కనిపెట్టిందేమీ లేదన్నారు. “మొన్నటిదాకా కేసీఆర్ ఫామ్‌హౌస్ వెయ్యి ఎకరాలన్నారు.. ఇప్పుడేమో 67 ఎకరాలని మాట మార్చారు. ఒక ఎకరం కోసమో, గజం భూమి కోసమో కేసీఆర్ ఆలోచిస్తారా? కేసీఆర్ పోరాడకపోతే తెలంగాణ వచ్చేదా? రేవంత్‌కు సీఎం కుర్చీ దక్కేదా?” అని నిప్పులు చెరిగారు.
ఓపెన్ ఛాలెంజ్:
ధరణి, భూభారతిలతో పాటు రేవంత్ రెడ్డి ఆస్తులు, తమ కుటుంబ ఆస్తులన్నింటిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని హరీష్ రావు సూటిగా సవాల్ విసిరారు.
