Crime News: భార్య భర్తల మధ్య గొడవలు జరగడం సహజమే కానీ పెళ్లైన 9 ఏళ్ల తర్వాత అదనపు కట్నం పిచ్చి, మద్యం మత్తు ఓ వ్యక్తిని మృగం గా మార్చాయి. గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్యని కాపురానికి రావాలని అడగడానికి వచ్చి భార్యపైనే రాక్షసంగా దాడికి తెగబడ్డాడు. ఆమె ముక్కును బలంగా కొరికి తీవ్రంగా గాయపరిచిన అమానుష ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రాజశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆశలు ఏంజరిగింది అంటే.
కోటపల్లికి చెందిన మమతకు, అదే మండలం మల్లంపేట్ గ్రామానికి చెందిన ఎనగందుల మణిచందర్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మణిచందర్ మద్యానికి బానిసయ్యాడు. గత నాలుగేళ్లుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ నిత్యం భార్య మమతను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. తరచుగా గొడవలు జరుగుతుండటంతో పది రోజుల క్రితం భర్త వేధింపులు భరించలేక మమత తన ఇద్దరు పిల్లలతో కలిసి కోటపల్లిలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది.
సోమవారం నాడు మణిచందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కోటపల్లిలోని అత్తగారింటికి వచ్చాడు. అక్కడ మమత కుటుంబంతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు.గొడవ తీవ్రరూపం దాల్చడంతో మణిచందర్ ఆగ్రహంతో మామ నారాయణపై దాడికి దిగాడు. తండ్రిని కొట్టవద్దంటూ కాపాడేందుకు మమత అడ్డువెళ్లడంతో, ఆమెపై విరుచుకుపడిన మణిచందర్ తీవ్ర ఆవేశంతో భార్య ముక్కును బలంగా కొరికేశాడు.ఈ దాడిలో మమత ముక్కు తీవ్రంగా తెగిపోయి రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు మణిచందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
