Konda Surekha

Konda Surekha: సచివాలయంలో మాజీ మంత్రి కొండా సురేఖ ఛాంబర్‌ సీజ్!

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన మాజీ మంత్రి కొండా సురేఖ ఉదంతంలో సచివాలయ వేదికగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రమశిక్షణా చర్యల పేరిట ఆమెను కేబినెట్ నుంచి ప్రభుత్వం తప్పించిన కొద్దిరోజులకే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆమెకు కేటాయించిన ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం నాడు ఆ గదులకు తాళాలు వేసి పూర్తిగా సీల్ చేశారు. మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికిన నేపథ్యంలో ఆమె అధికారిక పేషీపై ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది.

4వ అంతస్తులోని ఛాంబర్ల సీజ్..

సచివాలయంలోని 4వ అంతస్తు (4F విభాగం)లో కొండా సురేఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె పేషీకి కేటాయించిన 10, 11, 12 నంబర్ల కార్యాలయ గదులకు అధికారులు తాళాలు వేశారు. అనంతరం ఆ మూడు గదుల ప్రవేశ ద్వారాలను సీజ్ చేశారు. ఛాంబర్‌లోని అధికారిక పత్రాలు, ఇతర ఫైళ్లను పరిశీలించిన అధికారులు ఛాంబర్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు.
పేషీ సిబ్బందిపై వేటు – సొంత శాఖలకు బదిలీ..
ఛాంబర్లను సీజ్ చేయడంతో పాటు కొండా సురేఖ వ్యక్తిగత సిబ్బంది (పేషీ) వ్యవహారంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆమె పేషీలో విధులు నిర్వర్తిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను తక్షణమే రద్దు చేస్తూ విధుల నుంచి తొలగించారు.
వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కొండా సురేఖ పేషీలోకి డిప్యుటేషన్‌పై వచ్చిన ఇతర సిబ్బందిని వెనక్కి పంపిస్తూ.. తక్షణమే వారి మాతృశాఖల్లో (Parent Departments) రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఆమె మంత్రి పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సచివాలయంలోని ఆమె అధికారిక కార్యాలయాన్ని కూడా మూసివేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *