Suicide: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉండాల్సిన పోలీస్ అధికారి స్టేషన్ ప్రాంగణంలోనే సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న బి. సత్యనారాయణ తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. స్టేషన్ ప్రాంగణంలోనే ఏకే-47 (AK-47) తుపాకీతో తనపై తాను కాల్పులు జరుపుకున్నారు.
ఛాతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్ – రక్తపు మడుగులో కుప్పకూలిన వైనం..
స్టేషన్లో ఒక్కసారిగా భారీ కాల్పుల శబ్దం వినిపించడంతో తోటి సిబ్బంది, సహచర పోలీసులు భయంతో అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి పరుగున వెళ్లి చూడగా, సత్యనారాయణ ఛాతి భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలో పడి ఉండటం కనిపించింది. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆయనను వెంటనే సమీపంలోని అరకు వ్యాలీ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం గ్రీన్ ఛానల్ ద్వారా విశాఖపట్నంలోని కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కారణాలపై ఆరా – ఉన్నతాధికారుల దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నిరంతరం అందరితో కలిసి ఉండే వ్యక్తి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టారు.కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు వంటి వ్యక్తిగత సమస్యలా? లేక విధి నిర్వహణలో ఎదురైన తీవ్ర పని ఒత్తిడి కారణమా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
