విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ కామెడీ టైమింగ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం పదును కలిస్తే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు కదా! ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ఈ సూపర్ కాంబో మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ (AK47) టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
త్రివిక్రమ్ మార్క్ కొటేషన్ – పేలిన పంచ్ డైలాగులు..
టీజర్ స్టార్టింగ్ లోనే త్రివిక్రమ్ తనదైన ఫిలాసఫీతో మొదలుపెట్టారు. డబ్బుకు, సబ్బుకు ఒకే పోలిక ఉంది.. మొదటిది చూస్తుండగానే కరిగిపోద్ది, రెండోది ఆలోచించే లోపే అరిగిపోద్ది!” అంటూ మధ్యతరగతి జీవన సత్యాన్ని చెప్పిన తీరు అందరి పెదవులపై నవ్వులు పూయిస్తోంది. నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందనే విషయం నాకు తెలుసు.. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి కూడా వెనకాడను” అంటూ వెంకీ పలికిన తీరు ఆకట్టుకుంది.
నది గట్టు దాటితే వరదంటారు.. అదే సముద్రం దాటితే ఉప్పెనంటారు.. కానీ సామాన్యుడు హద్దు దాటితే బలమైన పదం, స్ట్రాంగ్ సౌండ్ వచ్చేది మీరే వెతకండి సార్!” అంటూ చివర్లో వచ్చే డైలాగ్ వింటుంటే థియేటర్లలో ఈలలు పడటం ఖాయమనిపిస్తోంది.
అసలు కథేంటి? – చిట్టిబాబు వెనుక ఉన్న మిస్టరీ..
ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ భార్యాపిల్లలే సర్వస్వంగా బతికే సాధారణ వ్యక్తి చిట్టిబాబు (వెంకటేష్). భార్య చేసే అప్పులు, నెలవారీ ఖర్చులతో ఎప్పుడూ ఇబ్బంది పడుతుంటాడు. అనుకోకుండా ఈ చిట్టిబాబు కుటుంబం ఒక ఖరీదైన ‘హౌస్ నెం. 47’ విల్లాలోకి మారుతుంది. అక్కడికి వెళ్లాక వారి జీవితంలోకి ఊహించని ప్రమాదం వచ్చిపడుతుంది.
తన భార్యాబిడ్డలను కాపాడుకోవడానికి చిట్టిబాబు ఎలాంటి సాహసం చేశాడు? అప్పుల ఊబి నుంచి ఫ్యామిలీని ఎలా బయటపడేశాడు? అసలు ఆ విల్లా వెనుక ఉన్న రహస్యమేంటి? చిట్టిబాబు నిజంగానే సామాన్యుడా లేక అతని వెనుక ఏదైనా బలమైన ఫ్లాష్‌బ్యాక్ ఉందా? అనేది సినిమాపై విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
భారీ తారాగణం – తమన్ మ్యూజిక్..
చిట్టిబాబు భార్యగా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నారా రోహిత్ కనిపించనున్నారు.వీరితో పాటు రఘుబాబు, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. తమన్ అందిస్తున్న నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రధాన బలంగా నిలిచింది.హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, నాగవంశీ సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువలలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 2న రిలీజ్ – వరుస అప్‌డేట్స్..
గత కొద్దిరోజులుగా ఈ చిత్రం వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లకు మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు.వచ్చేవారంలోనే తమన్ కంపోజ్ చేసిన అదిరిపోయే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నారు.
ఆ తర్వాతి వారం ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దసరా సెలవుల సీజన్‌లో కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి హాయిగా నవ్వుకోవడానికి, మంచి ఎమోషన్ ఫీల్ అవ్వడానికి ‘ఆదర్శ కుటుంబం’ పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.