Supreme Court: అది శిక్ష కాదు.. ప్రవర్తనపై మచ్చ అంతకన్నా కాదు.. !

Supreme Court: ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే నిర్బంధ పదవీ విరమణ (Compulsory Retirement) ప్రక్రియపై దేశ అత్యున్నత న్యాయస్థానం అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఉద్యోగిని నిర్బంధ పదవీ విరమణ చేయించడం ఎట్టిపరిస్థితుల్లోనూ శిక్షాత్మక చర్య కాదని, సదరు ఉద్యోగి ప్రవర్తనపై ఎలాంటి మచ్చ లేదా తప్పుడు ఆరోపణలు మోపినట్లు భావించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిపాలనా సామర్థ్యాన్ని కాపాడుకోవడం, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయని స్పష్టం చేసింది.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంలో పనిచేస్తూ కంపల్సరీ రిటైర్మెంట్ పొందిన ఐదుగురు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ మన్మోహన్, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

“డెడ్ వుడ్”ను తొలగించే అధికారం ప్రభుత్వానిదే.. సుప్రీంకోర్టు

ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగుల కొనసాగింపుపై సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

  • పరిపాలనా సమర్థత ముఖ్యం: ఒక అధికారి లేదా సిబ్బందిని సర్వీసులో కొనసాగించడం వల్ల పరిపాలనా సమర్థత దెబ్బతింటుందా లేదా సదరు ఉద్యోగి “డెడ్ వుడ్” (ఉపయోగం లేని వ్యక్తి)గా మారాడా అనే విషయాన్ని అంచనా వేసే పూర్తి అధికారం ప్రభుత్వానిదే (Executive domain).

  • ఊహాగానాలతో కుదరదు: అయితే ఇలాంటి నిర్ణయాలు అధికారుల వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ఊహాగానాల ఆధారంగా ఉండకూడదు. అందుబాటులో ఉన్న రికార్డులు, స్పష్టమైన సమాచారం ప్రాతిపదికన మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.

  • వ్యక్తిగత పరిశీలన తప్పనిసరి: ప్రతి ఉద్యోగి ఉపయోగం, నిజాయితీ (Integrity), వార్షిక రహస్య నివేదికలు (ACR), పనితీరును విడివిడిగా పరిశీలించాలి. అంతేకానీ “నాతో సమానమైన రికార్డు ఉన్న మరొకరిని కొనసాగించి, నన్ను మాత్రమే ఎందుకు రిటైర్ చేశారు?” అని ప్రశ్నిస్తూ ఈ నిర్ణయాన్ని సవాలు చేయలేరని కోర్టు తేల్చిచెప్పింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 14.. “నెగెటివ్ సమానత్వం” చెల్లదు!

పిటిషనర్లు లేవనెత్తిన సమానత్వ వాదనలను సుప్రీంకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. సమానమైన పరిస్థితుల్లో ఉన్న మరొక ఉద్యోగిపై చర్యలు తీసుకోలేదన్న కారణంతో.. ఒక ఉద్యోగిపై తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధం లేదా వివక్షాపూరితం కాజాలదు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రసాదించిన ‘సమానత్వ హక్కు’ సానుకూల భావన (Positive concept) మాత్రమే. గతంలో ఎవరికైనా పొరపాటున లేదా అక్రమంగా మినహాయింపు దక్కితే.. దాన్నే ప్రాతిపదికగా తీసుకుని “నెగెటివ్ ఈక్వాలిటీ” (Negative equality) కింద అదే తప్పును తమకూ వర్తింపజేయాలని ఎవరూ డిమాండ్ చేయలేరు.

న్యాయ సమీక్ష పరిమితులు.. కోర్టుల జోక్యం ఎప్పుడు?

ప్రభుత్వ పరిపాలనా నిర్ణయాలపై న్యాయస్థానాలు అప్పిలేట్ అథారిటీలా వ్యవహరించబోవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.నిర్బంధ పదవీ విరమణ ఉత్తర్వులను జారీ చేసే క్రమంలో ప్రభుత్వం నిర్దేశిత నిబంధనలను పాటించిందా లేదా అన్న అంశాన్ని మాత్రమే న్యాయ సమీక్ష పరిశీలిస్తుంది.

ఆధారాలు లేకుండా, ఎలాంటి విచక్షణ ఉపయోగించకుండా, స్పష్టమైన కక్షసాధింపు లేదా దురుద్దేశపూర్వకంగా (Malafide intentions) ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాల్లో మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి.

ఛత్తీస్‌గఢ్ కేసు నేపథ్యం..

2017లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా స్క్రీనింగ్ కమిటీ 14 మంది ఉద్యోగుల సర్వీస్ రికార్డులను సమగ్రంగా పరిశీలించింది. వీరిలో 9 మంది పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో సర్వీసులో కొనసాగించగా.. మిగిలిన ఐదుగురి ఏసీఆర్ (ACR)లు నిర్దేశిత ప్రమాణాల కంటే దిగువన ఉండటం, వారి సామర్థ్యం తగ్గడాన్ని గుర్తించి నిర్బంధ పదవీ విరమణ చేయించింది.

ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మొదట సింగిల్ జడ్జి బెంచ్, అనంతరం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేశాయి. తాజాగా సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి వివక్ష లేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించిందని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *