KTR

KTR: రూ.లక్ష పెట్టుబడి ఉన్న షెల్ కంపెనీకి రూ.200 కోట్ల భూములా?

KTR: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య భూ కేటాయింపులు, అసెంబ్లీ పరిణామాలపై మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన ‘టెస్సెరాక్ట్’ (Tesseract) డిఫెన్స్ కంపెనీకి కేటాయించిన భూములను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను తుంగలో తొక్కిందని, వెయ్యి రోజుల పాలనలో సాధించిందేంటని ప్రశ్నిస్తే అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కి సస్పెండ్ చేయించారని మండిపడ్డారు.

రూ.లక్ష పెట్టుబడి ఉన్న షెల్ కంపెనీకి రూ.200 కోట్ల భూములా?

టెస్సెరాక్ట్ సంస్థపై ఆరోపణలు
రూ.లక్ష పెట్టుబడితో, ఒక్క ఉద్యోగి కూడా లేని ఒక షెల్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి తన సోదరుడి కోసం ఎలా కట్టబెట్టారని కేటీఆర్ నిలదీశారు. ఆ భూమి రేవంత్ జాగీరు కాదని స్పష్టం చేశారు.
దావోస్ పర్యటనపై సెటైర్లు
సీఎం దావోస్ వెళ్లి తన సోదరుడి సంస్థ కోసం ఏకంగా 18 గంటలు శ్రమించి ఇజ్రాయెల్ పెద్దలతో చర్చలు జరిపారని ఆరోపించారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ఇజ్రాయెల్ ఒప్పందాలను తప్పుపడుతుంటే.. ఇక్కడ రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు ఎవరి ఆదేశాలతో డీల్స్ కుదుర్చుకుంటున్నారని ప్రశ్నించారు.
బీజేపీ – రేవంత్ కుమ్మక్కు?
మంత్రి పొంగులేటి కూడా ఏరోస్పేస్ కంపెనీ పెట్టారని, దోచుకున్న ప్రజాధనాన్ని అంతరిక్షంలో దాచుకోవడానికే ఈ సంస్థలని ఎద్దేవా చేశారు. ఇంత బహిరంగంగా దోపిడీ జరుగుతున్నా బీజేపీ ఎందుకు స్పందించడం లేదని, ఈడీ (ED) చేత విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నిస్తూ.. బీజేపీ, రేవంత్ కలిసి నాటకమాడుతున్నారని ఆరోపించారు.

గాంధీల పాలనలో గజానికో గజదొంగ.. గుంటకొక గుంటనక్క..

22A నిషేధిత భూముల వివాదంపై తెలంగాణ భవన్‌లో హరీశ్ రావుతో కలిసి కేటీఆర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బాధితులతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు:
కేసీఆర్ హయాంలో కేవలం 16 లక్షల ఎకరాలు మాత్రమే 22A జాబితాలో ఉంటే.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఏకంగా కోటి 16 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి సామాన్యుల ఆస్తులపై కబంధహస్తాలు విసిరారని ధ్వజమెత్తారు.
ఫ్యూచర్ సిటీ అనేది ఒక మిథ్య అని, దానికి అసలు భవిష్యత్తే లేదన్నారు. కొంగరకలాన్‌లో 100 ఎకరాలపై సీఎం కన్నుపడిందని ఆరోపించారు. చివరకు మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడానికి కూడా ఈ 22A భూముల పంచాయితీయే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్కపై దాడి జరిగితే తమ్ముడు ఊరుకుంటాడా?

ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకే కేసీఆర్ తమను సభకు పంపారని కేటీఆర్ చెప్పారు. సభ వెలుపల మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు.

సీఎం రేవంత్ టీమ్ సృష్టించిన నకిలీ ఫేస్‌బుక్ ఖాతా ఆధారంగా అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని, ఆ పోస్టు పెట్టిన ‘అంతర్జాతీయ కార్యదర్శి’ ఎవరో ప్రభుత్వం బహిర్గతం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ భూదందాలపై కోర్టుకు వెళ్లడంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఊరూరా సదస్సులు పెట్టి ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *