Nara Lokesh

Nara Lokesh: ఎన్‌ఆర్‌ఐలు అంటే నాన్-రెసిడెంట్ కాదు.. మోస్ట్ రియలబుల్ ఇండియన్స్

Nara Lokesh: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం, ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల (NRI) పాత్ర వెలకట్టలేనిదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్‌ఆర్‌ఐలంటే కేవలం ‘నాన్-రెసిడెంట్ ఇండియన్స్’ కాదని, సంక్షోభ సమయంలో అండగా నిలిచే “మోస్ట్ రియలబుల్ ఇండియన్స్” (Most Reliable Indians) అని లోకేశ్ ప్రశంసించారు.

గొడ్డలి పార్టీపై పోరాటంలో అండగా నిలిచారు..

2019 నుంచి 2024 వరకు గత వైఎస్సార్సీపీ “గొడ్డలి పార్టీ” అరాచకాలు, కక్షసాధింపులతో రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు పడిందని లోకేశ్ గుర్తుచేశారు. ఆనాటి ప్రభుత్వ అన్యాయాలపై తాము చేసిన ప్రతి పోరాటంలో ఎన్‌ఆర్‌ఐలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి సహకారం అందించారని తెలిపారు. కేవలం విదేశాల్లో నిరసనలు తెలపడమే కాకుండా, ఎన్నికల సమయంలో తమ సొంత గ్రామాలకు తరలివచ్చి ప్రజల్లో చైతన్యం నింపారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలనే ఏకైక సంకల్పంతో పనిచేసి ప్రజా ప్రభుత్వం రావడంలో ఎన్‌ఆర్‌ఐలు కీలక భూమిక పోషించారని ప్రశంసించారు.

ప్రపంచ వేదికలపై తెలుగు జాతి ఖ్యాతిని చాటుతున్న ఎన్‌ఆర్‌ఐలే మన జాతికి అసలైన బ్రాండ్ అంబాసిడర్లని, తెలుగు జాతిని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టేందుకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబుపై ఒక్క ఆరోపణనైనా నిరూపించారా?..

సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున (సెప్టెంబరు 9) టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు మోపారని, కానీ అందులో ఒక్కటైనా నిరూపించగలిగారా అని నిలదీశారు. చంద్రబాబు ఏ తప్పూ చేయకపోయినా కక్షతో జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఆ క్లిష్ట సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్‌ఆర్‌ఐలు రోడ్లపైకి వచ్చి “ఐ యామ్ విత్ సీబీఎన్” (I am with CBN) అంటూ నినదించి పోరాడారని గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆలోచిస్తుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *