Erravalli: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి గ్రామ పరిసరాలు తీవ్ర ఉద్రిక్తతలకు వేదికయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం (ఫామ్‌హౌస్) ముట్టడికి కాంగ్రెస్ పార్టీ ‘డప్పుల మోత’ పేరుతో పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు సైతం భారీగా మోహరించడంతో ఎర్రవల్లి రణరంగాన్ని తలపించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు యంత్రాంగం భారీగా మోహరించి బారికేడ్లు, రోప్ పార్టీలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
బారికేడ్లు తోసుకుని దూసుకెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు – తోపులాట..
బొల్లారం వద్ద కేటీఆర్, హరీశ్‌రావుల నిర్బంధం – పాదయాత్ర..
పోలీసులు వాహనాలను అనుమతించకపోవడంతో కేటీఆర్, హరీశ్‌రావు ఇతర నేతలతో కలిసి బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవల్లి వైపునకు పాదయాత్రగా బయల్దేరారు. ప్రభుత్వమే పోలీసుల అండతో కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగొల్పి దాడులకు పురిగొల్పుతోందని, ప్రతిపక్ష నేతలకు స్వేచ్ఛ లేకుండా చేస్తోందని ఈ సందర్భంగా వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉదయం నుంచి ఎర్రవల్లి, మర్కుక్, బొల్లారం పరిసర ప్రాంతాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
