Chandrababu: విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను కొనియాడుతూ ఆయన భావోద్వేగపూరితంగా, దూరదృష్టితో కూడిన ప్రసంగం చేశారు. చిన్నతనంలో అక్షరాలు నేర్పిన ఉపాధ్యాయుడిని జీవితంలో ఎవరూ మర్చిపోలేరని, టీచర్‌గా జీవితం ప్రారంభించి దేశ రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని గుర్తుచేశారు.
తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ‘మెగా డీఎస్సీ’ ఫైలుపైనే పెట్టానని, ఎంతో కష్టపడి చదివితే తప్ప టీచర్ ఉద్యోగం రాదని, అలాంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడటం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేశారు.
టెక్నాలజీ యుగం – గురువు స్థానం ప్రత్యేకం..
1990ల మొదట్లోనే టెలికాం, ఐటీ విప్లవాన్ని ముందే ఊహించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని, నాడు వేసిన పునాదుల వల్లే హైదరాబాద్ రూపురేఖలు మారాయని సీఎం గుర్తుచేశారు. నేడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు, డ్రోన్లు, రోబోటిక్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి అత్యాధునిక రంగాలు వచ్చాయని, మరో 20 ఏళ్లలో సరికొత్త భారతదేశాన్ని చూస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఏఐ టీచర్ తోడుగా వచ్చినా.. గురువే కీలకం..
టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరించినా తరగతి గదిలో గురువుకు ఎప్పటికీ ప్రత్యామ్నాయం ఉండదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల పనిభారాన్ని తగ్గించి, వారికి సహాయపడేందుకు త్వరలోనే ‘ఏఐ టీచర్’ (AI Teacher) టూల్స్ వస్తాయని, అయితే మానవీయ స్పర్శ, మార్గదర్శనం అందించేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు.
మారుతున్న బాల్యం – ఉపాధ్యాయుల బాధ్యత..
“మా చిన్నప్పుడు ఉపాధ్యాయులు క్రమశిక్షణ కోసం దెబ్బలు వేసేవారు, భయభక్తులతో చదువుకుని అంతా ఉన్నత స్థానాలకు చేరుకున్నాం. కానీ నేటి తరం పిల్లల మానసిక పరిస్థితి వేగంగా మారుతోంది. పిల్లలకు గట్టిగా చెప్పాలంటే టీచర్లు జంకే పరిస్థితి వచ్చింది” అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా ప్రభావం – నైతిక విలువలు..
సామాజిక మాధ్యమాలు, మొబైల్ స్క్రీన్లు చిన్నారుల ఆలోచనా విధానాన్ని దెబ్బతీస్తున్నాయని, అవి శాపంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పిల్లల్లో కుటుంబ విలువలు, నైతిక ప్రవర్తన పెంపొందించే బాధ్యతను ఉపాధ్యాయులే తీసుకోవాలని పిలుపునిచ్చారు.
పచ్చదనం & మౌలిక వసతులు..
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, బడి పరిసరాలు పచ్చగా ఉంటేనే విద్యార్థులకు స్వచ్ఛమైన ఆలోచనలు వస్తాయని పేర్కొన్నారు.
విద్యారంగంలో పెను మార్పులు – యూనివర్సిటీ కోర్సుల ప్రక్షాళన..
నేటి ఆధునిక సమాజానికి, ఉద్యోగ అవకాశాలకు ఏమాత్రం ఉపయోగపడని పాత కోర్సులను యూనివర్సిటీల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించారు. కొన్ని కోర్సులు చదివేందుకు విద్యార్థులే ముందుకు రావడం లేదని, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త సాంకేతిక కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు.
ఉపాధ్యాయులు ఆత్మగౌరవంతో, అత్యున్నత విలువలతో జీవించాలని, బదిలీల కోసమో, ఇతర పనుల కోసమో రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలుగువాళ్లే ముందుంటున్నారని, ఎక్కువ సంపాదిస్తున్నది కూడా మనవాళ్లేనని చెప్పారు. గ్లోబల్ స్థాయిలో తెలుగుజాతి నెంబర్ వన్‌గా నిలవాలంటే ఆ దిశగా రాష్ట్రాన్ని, నవతరాన్ని నడిపించే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని పిలుపునిచ్చారు.
