AP Cabinet

AP Cabinet:  ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఇన్నర్ రింగ్ రోడ్డుకు 6,612 ఎకరాల భూసమీకరణ..!

AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని విస్తరణ, వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని నగరంలో రూ.758.79 కోట్ల వ్యయంతో ‘అమరావతి సంగమం’ ప్రాజెక్టును చేపట్టడంతో పాటు, అమరావతి-విజయవాడ-గుంటూరు అనుసంధాన ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భారీ ఎత్తున భూసమీకరణకు పచ్చజెండా ఊపింది.

రాజధాని అభివృద్ధి & మౌలిక వసతులు..

  • శాఖమూరులో ‘అమరావతి సంగమం’
    రూ.758.79 కోట్ల భారీ అంచనాతో రాజధాని పరిధిలోని శాఖమూరులో అత్యాధునిక ‘అమరావతి సంగమం’ నిర్మించనున్నారు. ఇందులో స్టేట్ పబ్లిక్ లైబ్రరీ, భారీ ఆడిటోరియం, గుడ్ గవర్నెన్స్ పరిశోధనా సంస్థలు కొలువుదీరనున్నాయి.
  • ఇన్నర్ రింగ్ రోడ్డుకు 6,612 ఎకరాల సమీకరణ:
    అమరావతి–విజయవాడ–గుంటూరు నగరాలను కలుపుతూ నిర్మించే ఇన్నర్ రింగ్ రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల కోసం కంతేరు, కాడిపూడి పరిధిలో 6,612 ఎకరాల భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు వావిల్తోటలో 2.2 ఎకరాలు, బోగులపల్లిలో 50.5 ఎకరాల భూమిని సమీకరించనున్నారు.
  • రైల్వే కనెక్టివిటీ & మార్కాపురం కలెక్టరేట్:
    అమరావతికి రైల్వే కనెక్టివిటీ విస్తరణపై చర్చించడంతో పాటు, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

రైతు సంక్షేమం & వ్యవసాయ రంగం:

  • రైతులకు రూ.375 కోట్ల చేయూత:
    తోతాపురి మామిడి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.281 కోట్ల నిధుల సమీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పొగాకు రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) ద్వారా రూ.94 కోట్ల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది.
  • రిజర్వాయర్ కేజ్ కల్చర్ పాలసీ:
    రాష్ట్రంలోని జలాశయాల్లో మత్స్య సంపదను, చేపల పెంపకాన్ని ఆధునిక పద్ధతుల్లో ప్రోత్సహించేందుకు సరికొత్త ‘రిజర్వాయర్ కేజ్ కల్చర్ పాలసీ’ ముసాయిదాను ఆమోదించారు.
  • వెలిగొండ ప్రాజెక్ట్:
    వెలిగొండ టన్నెల్‌లో నిలిచిపోయిన టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) డిస్మాంట్లింగ్ పనులకు రూ.11.63 కోట్లను కేటాయించారు.

ఏపీ పౌల్ట్రీ పాలసీ-2026 & నియామకాలు:

  • పౌల్ట్రీ పరిశ్రమకు 4% వడ్డీ రాయితీ:
    పౌల్ట్రీ రంగాన్ని విస్తరించి 18,480 కొత్త ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో రూపొందించిన ‘ఏపీ పౌల్ట్రీ పాలసీ-2026’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త యూనిట్లు స్థాపించే వారికి 4 శాతం వడ్డీ రాయితీ అందించనున్నారు.
  • పోలీస్ శాఖకు 4,760 కొత్త వాహనాలు:
    శాంతిభద్రతల పర్యవేక్షణ, పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు పోలీసు విభాగానికి 4,760 నూతన వాహనాల కొనుగోలుకు అనుమతించారు.
  • న్యాయ, వైద్య రంగాలు:
    గుంటూరు జిల్లా మంగళగిరిలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు, దానికి అవసరమైన 20 రెగ్యులర్ పోస్టుల బదిలీకి ఆమోదం తెలిపారు. రాజమండ్రి ఈఎస్ఐ (ESI) ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యానికి అప్‌గ్రేడ్ చేస్తూ కొత్త పరికరాలు, సిబ్బందిని మంజూరు చేశారు.

విద్యుత్ & వరద నిధులు

  • ఏపీ ట్రాన్స్‌కోకు రూ.950 కోట్ల పూచీకత్తు:
    విద్యుత్ నెట్‌వర్క్ పటిష్టత కోసం ఏపీ ట్రాన్స్‌కో తీసుకునే మధ్యకాలిక రుణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.950 కోట్ల ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం లభించింది. కడప జిల్లాలో పీఎం-కుసుమ్ కింద సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రోత్సహించనున్నారు.
  • వరద పనులకు రూ.6.24 కోట్లు:
    కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల సమయంలో కలెక్టర్లు చేపట్టిన 78 అత్యవసర పనులకు రూ.6.24 కోట్లు మంజూరు చేస్తూ రాటిఫికేషన్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *