Nara Lokesh

Nara Lokesh: అక్టోబర్ నుంచే కొత్త పెన్షన్లు.. అప్పటికే లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి

Nara Lokesh: రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు దక్కాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన, ప్రజా సమస్యల పరిష్కారం, పాలనలో అలసత్వాన్ని వీడటంపై దిశానిర్దేశం చేశారు. వచ్చే అక్టోబర్ నెల నుంచే దశలవారీగా కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తామని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్హులకు న్యాయం చేయాలని సహచర మంత్రులను కోరారు. మంత్రులంతా సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

అక్టోబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు – వాయిదా ప్రసక్తే లేదు..

కోర్టుల్లో ఉన్న న్యాయపరమైన చిక్కులను వేగంగా పరిష్కరించి అన్ని స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని లోకేశ్ వెల్లడించారు. తొలుత మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, చివరగా పంచాయతీ ఎన్నికలను వరుసగా నిర్వహించి అక్టోబరు నాటికి పూర్తి ప్రక్రియను ముగిస్తామని తెలిపారు.
స్థానిక ఎన్నికలు ఆలస్యమైతే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయని, అందుకే ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రతిపక్షం కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. కూటమి శ్రేణులు క్షేత్రస్థాయిలో కష్టపడి అన్ని స్థానాల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

అధికారుల తీరుపై సీరియస్ – సోషల్ మీడియా ట్రోలింగ్‌పై జాగ్రత్త..

ప్రభుత్వానికి లేదా మంత్రులకు చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించే అధికారులను, బాధ్యతారహితంగా ఉండే సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని లోకేశ్ హెచ్చరించారు. ఇటీవల కొన్ని శాఖల్లో సమస్యలు ఒకరిద్దరు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఉత్పన్నమయ్యాయని, అలాంటి వారిపై ప్రత్యామ్నాయ కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ట్రోలింగ్ సాగుతున్నాయని, చిన్న పొరపాటు జరిగినా పెద్దదిగా చూపే కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేలా మంత్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రత్యేక కార్యక్రమం & నీటి పొదుపు చర్యలు..

పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా అరెస్ట్ చేసి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా (సెప్టెంబరు 9న) ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. అడ్డంకులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో ఎలా నడిపిస్తున్నారో ప్రజలకు వివరించాలని చెప్పారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున, తాగు, సాగునీటి అవసరాల కోసం ముందస్తు పొదుపు చర్యలు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *