Viral News

Viral News: 200 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓ ఆడపిల్ల జన్మించింది..!

Viral News: సమాజంలో ఇంకా కొందరు మగ సంతానం కోసమే ఆరాటపడుతున్న రోజుల్లో, ఒక కుటుంబం తమ ఇంటికి ఆడపిల్ల రావాలని ఏకంగా రెండు శతాబ్దాల పాటు వేచి చూసింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన దహిఫాలే కుటుంబంలో ఐదు తరాల తర్వాత, అంటే దాదాపు 200 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓ ఆడపిల్ల జన్మించింది. తమ వంశంలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టిందన్న ఆనందంతో ఆ కుటుంబ సభ్యులు చేసిన సంబరాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటున్నాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన చిన్నారికి ప్రత్యేకంగా పూలతో అలంకరించిన రథం, మేళతాళాలు, బాజాభజంత్రీలు, నృత్యాలతో రాజసం ఉట్టిపడేలా గ్రామంలో ఘన స్వాగతం పలికారు.

“మా బాధ తీరిపోయింది” – కంటతడి పెట్టిన తాత 

దహిఫాలే వంశంలో గత ఐదు తరాలుగా కేవలం మగపిల్లలే పుడుతూ వచ్చారు తప్ప ఒక్క ఆడపిల్ల కూడా జన్మించలేదు. దీంతో తమ వంశంలో ఆడపిల్ల లేదన్న లోటు ఆ కుటుంబాన్ని తరతరాలుగా వెంటాడింది.
చిన్నారికి ‘గార్గి’ అని నామకరణం చేశారు. పాప రాకతో మురిసిపోయిన తాత లింబాజీ దహిఫాలే మాట్లాడుతూ.. “మా కుటుంబంలో ఆడపిల్ల లేదనే తీరని బాధ ఉండేది. ఈరోజు గార్గి రాకతో మా చిరకాల కోరిక నెరవేరింది. లక్ష్మీదేవిలాంటి నా మనవరాలిని సంగీత వాయిద్యాల నడుమ, రథంపై కూర్చోబెట్టి ఇంటికి తీసుకురావడం నా జీవితంలోనే అత్యంత అదృష్టవంతమైన క్షణం” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

“పువ్వులా పెంచుకుంటాం” – తండ్రి మురిపెము..

పాప తండ్రి మాట్లాడుతూ.. “చాలామంది మగ సంతానం కావాలని కోరుకుంటారు, కానీ ఇంట్లో ఆడపిల్ల అడుగుపెట్టినప్పుడు కలిగే అనుభూతి, ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆడపిల్లలు తండ్రిపై చూపించే ప్రేమ, ఆప్యాయత ఎంతో గొప్పవి. మా ఇంటి మహాలక్ష్మిని కళ్లలో పెట్టుకుని, ఒక పువ్వులా అత్యంత గారబంగా పెంచుకుంటాం” అని ఆనందం వ్యక్తం చేశారు.

ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకునే మార్గమంతా కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్లపై భజనలు చేస్తూ, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్సులు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఆడపిల్ల పుట్టుకను ఒక పండుగలా జరుపుకుని, ఆమె రాకను చిరస్మరణీయం చేసిన ఈ ఘటన ఆడపిల్లల ప్రాధాన్యతను చాటుతూ సమాజానికి సరికొత్త స్ఫూర్తిని నింపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *