Kadiyam Srihari: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 97 (GO 97) పై విద్యార్థులు, విద్యావేత్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మాజీ విద్యాశాఖ మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల్లో నెలకొన్న గందరగోళం, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం పెద్ద మనసుతో జీవో 97ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యా శాఖ (Technical Education) పరిధిలోనే కొనసాగించాలని, దానిని లేబర్ శాఖ లేదా ప్రత్యేక విభాగానికి మార్చవద్దని ఆయన ప్రభుత్వానికి స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యను ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌తో కలిపి ఉంచినప్పుడే విద్యార్థుల ఉన్నత చదువులకు, భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భరోసా ఇచ్చినట్లు అవుతుందని కడియం పేర్కొన్నారు.
దేశవ్యాప్త విధానమే ఉండాలి..
నైపుణ్యాలతో (Skills) పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇప్పటికే మంచి ఉద్యోగావకాశాలు వస్తున్నాయని, దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రమాణాల ప్రకారమే తెలంగాణలోనూ విద్యా విధానం కొనసాగాలని సూచించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నిర్ణయం వల్ల విద్యార్థుల్లో అనేక భయాందోళనలు, అపోహలు నెలకొన్నాయని, ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు..
‘శక్తి స్కీం’ కింద పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.
ఈ నిర్ణయం వల్ల తమ డిప్లొమా సర్టిఫికెట్ల గుర్తింపు, ఇంజినీరింగ్ ఈసెట్ (ECET) ద్వారా లేటరల్ ఎంట్రీ ప్రవేశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
కేకే నేతృత్వంలో హైలెవల్ కమిటీ..
విద్యార్థుల నిరసనలు ఉధృతం కావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వివాదంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు సీనియర్ నేత కె. కేశవరావు నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని (High-level Committee) ఏర్పాటు చేసింది.
