Chandrababu

Chandrababu: గిరిజన ఆరోగ్యానికి గేమ్ ఛేంజర్.. 3 నెలల్లో పీహెచ్‌సీల ఆధునికీకరణ..!

Chandrababu: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలోని గన్నెల పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించారు. గిరిజనుల ఆరోగ్య సంరక్షణే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘సంజీవని’ (Sanjeevani) పథకాన్ని, మొబైల్ యాప్‌ను ఆయన అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో వైద్యం, విద్య, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
‘సంజీవని’ పథకం – ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు..
గతంలో ఏ చిన్న అనారోగ్యం వచ్చినా గిరిజనులు విశాఖపట్నం లేదా పాడేరు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై ఆ అవసరం లేకుండా సంజీవని ద్వారా స్థానికంగానే పరీక్షలు, చికిత్స అందిస్తామని సీఎం తెలిపారు. మీ పూర్తి ఆరోగ్య చరిత్ర (Medical Records) మీ ఫోన్‌లోనే అందుబాటులో ఉంటుందని చెప్పారు.
3 నెలల్లో పీహెచ్‌సీల అభివృద్ధి..
ఏజెన్సీలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (PHCs) రాబోయే 3 నెలల్లో పూర్తిస్థాయిలో ఆధునికీకరించి, అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు అక్కడే జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏజెన్సీ పరిధిలో నెట్‌వర్క్ సమస్యలను పరిష్కరించి డిజిటల్ సేవలందించేందుకు కొత్తగా మొబైల్/శాటిలైట్ టవర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

గిరిజనులకు కీలక హామీలు – అభివృద్ధి ప్రణాళికలు..

  • జీవో నంబర్ 3పై పునరుద్ధరణ హామీ: గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే దక్కాలన్న ఉద్దేశంతో గతంలో తానే జీవో నంబర్ 3 తీసుకొచ్చానని గుర్తుచేస్తూ.. న్యాయపరమైన చిక్కులు లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన జీవోను మళ్లీ తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.
  • ఐఐటీ, నీట్ శిక్షణ: గిరిజన బిడ్డలు జాతీయ స్థాయిలో రాణించేందుకు ఐఐటీ (IIT), నీట్ (NEET) వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామన్నారు.
  • వాణిజ్య పంటలు & అరకు కాఫీ: అరకు కాఫీకి ఇప్పటికే ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చామని, ఏజెన్సీలో పండే వాణిజ్య పంటలకు ప్రోత్సాహం అందించి గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు.
  • మౌలిక సదుపాయాలు: ప్రతి గిరిజన పల్లెకు పక్కా రోడ్డు వేస్తామని, సాగు-తాగునీటి కోసం వాగులు, వంకలపై చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తామని తెలిపారు.
  • టూరిజం ప్రమోషన్: అరకు, పాడేరులలో కశ్మీర్‌ను మించిన ప్రకృతి అందాలు ఉన్నాయని, అల్లూరి జిల్లాను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు ఆ రోజుల్లోనే గిరిజనులకు ఆయుర్వేద వైద్యాన్ని అందించారని, ఆయన సేవలను స్మరిస్తూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టినట్లు చంద్రబాబు గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *