Hyderabad Traffic Diversion

Hyderabad Traffic Diversion: కేబీఆర్ పార్కు చుట్టూ 360 డిగ్రీల వన్-వే అమలు.. రెండేళ్ల పాటు ట్రాఫిక్ ఆంక్షలు! మీ ప్రయాణ మార్గాలు ఇవే!

Hyderabad Traffic Diversion: హైదరాబాద్ నగర ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు అత్యంత ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన H-CITI ప్రాజెక్ట్ లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీల వన్-వే విధానాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చారు.

ఈ నిర్మాణాలు పూర్తయ్యే వరకు, అంటే దాదాపు రెండేళ్ల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
గూగుల్ మ్యాప్స్‌లో కొత్త రూట్ – 13 ఎగ్జిట్ పాయింట్లు..
వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు..
  • లేన్ మార్పులు & ఎగ్జిట్లు: వన్-వే లూప్ నుంచి బయటకు వెళ్లేందుకు 13 ఎగ్జిట్ పాయింట్లు, దారి మారడానికి 10 లైన్ చేంజర్లు ఏర్పాటు చేశారు. కేవలం ఈ 10 ప్రాంతాల్లో మాత్రమే లేన్ మారేందుకు అనుమతి ఉంటుంది.
  • గూగుల్ మ్యాప్స్ అప్‌డేట్: పార్కు చుట్టూ కొత్త యూ-టర్న్‌లు, ఎగ్జిట్ పాయింట్లతో కూడిన రూట్ మ్యాప్‌ను గూగుల్ మ్యాప్స్‌లో పొందుపరిచారు. ప్రయాణానికి ముందు మ్యాప్స్ చూసుకోవడం ద్వారా గమ్యస్థానాన్ని సులభంగా చేరుకోవచ్చు.
  • పోలీసుల హెచ్చరిక: సూచిక బోర్డులను గమనిస్తూ డ్రైవ్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ సైడ్ డ్రైవింగ్ మరియు రాత్రి వేళల్లో అతివేగం వద్దని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సూచించారు.

కీలక ప్రాంతాలకు ప్రయాణ మార్గాలు ఇవే:

  1. పంజాగుట్ట నుంచి మాదాపూర్:
    ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద ఎడమవైపు తిరిగి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్ చౌరస్తా, జర్నలిస్టు కాలనీ మీదుగా రోడ్ నంబర్ 45కు వెళ్లి.. అక్కడి నుంచి మాదాపూర్ చేరుకోవచ్చు. లేదా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ఎడమవైపునకు మళ్లవచ్చు.
  2. అమీర్‌పేట్ నుంచి ఫిలింనగర్:
    జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి ఎడమవైపు తిరిగి టీడీపీ కార్యాలయం రోడ్డు వైపు వెళ్లాలి. బసవతారకం ఆసుపత్రి వద్ద నుంచి బీఆర్ఎస్ భవన్ రోడ్డుకు మళ్లి, పాత రూట్ ద్వారా ఫిలింనగర్‌కు చేరుకోవచ్చు.
  3. అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ / పెద్దమ్మ గుడి:
    ఇకపై జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా వెళ్లలేరు. అమీర్‌పేట్, యూసూఫ్‌గూడ వైపు నుంచి వెళ్లేవారు డొమినోస్ పిజ్జా సెంటర్ దాటిన తర్వాత ఎడమవైపు తిరిగి నేరుగా హైటెక్ సిటీ, పెద్దమ్మ గుడి రోడ్డుకు చేరుకోవాలి.
  4. హైటెక్ సిటీ నుంచి ఫిలింనగర్:
    జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా టీడీపీ కార్యాలయం, బసవతారకం ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్ చౌరస్తా, జర్నలిస్టు కాలనీ రోడ్డు ద్వారా ఫిలింనగర్ చేరుకోవచ్చు.
  5. ఫిలింనగర్ నుంచి పంజాగుట్ట:

    ఈ మార్గంలో ఎలాంటి మార్పులు లేవు. గతంలో మాదిరిగానే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమవైపు రోడ్డు మీదుగా పంజాగుట్ట చేరుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *