Delhi Red Fort Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 11 మంది ప్రాణాలు తీసిన ఘోర ఉగ్రవాద పేలుడు ఘటనపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) నివేదిక అంతర్జాతీయ స్థాయిలో ఒక కీలక విషయాన్ని ధృవీకరించింది. ఈ విధ్వంసకర దాడికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా అనుబంధ విభాగమే బాధ్యత వహించిందని నివేదిక స్పష్టం చేసింది.
భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముందే ఊహించిన ఈ దాడుల వెనుక ఆల్‌ఖైదా నెట్‌వర్క్ ఉందని, ప్రస్తుతం ఐరాస విడుదల చేసిన అంతర్జాతీయ నివేదిక ఆధారాలతో సహా మొహరు వేసింది.
ఎర్రకోట దాడి – ఉగ్ర కదలికలు..
నవంబర్ 10, 2025న ఎర్రకోట సమీపంలో వాహనంలో అమర్చిన పేలుడు పదార్థం (Vehicle-borne IED) ద్వారా ఈ విధ్వంసం జరిగింది.
-
సూత్రధారి ఆత్మహుతి: ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీకి చెందిన మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమర్ ఉన్-నబీ ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా ఎన్ఐఏ గుర్తించగా, అతడు కూడా ఆ పేలుడులోనే మరణించాడు.
-
చిన్న చిన్న విభాగాలుగా విస్తరణ: భారత ఉపఖండంలో ఉన్న ఆల్‌ఖైదా విభాగం (AQIS) పెద్ద సంఖ్యలో కాకుండా, రక్షణ దళాల కంటపడకుండా ఉండేందుకు చిన్న చిన్న స్వతంత్ర విభాగాలుగా (Decentralised Small Cells) విడిపోయి దాడులకు పథకం రచిస్తోందని ఐరాస తెలిపింది.
-
బంగ్లాదేశ్ వ్యాప్తి యత్నాలు: దక్షిణాసియాలో తన స్థావరాన్ని పెంచుకునేందుకు బంగ్లాదేశ్‌లో ఉగ్ర నెట్‌వర్క్‌ను పునరుద్ధరించేందుకు ఆల్‌ఖైదా యత్నిస్తోందని హెచ్చరించింది.
ఉగ్రవాదుల చేతుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)!
ఐక్యరాజ్యసమితి దర్యాప్తు బృందం ఈ నివేదికలో మరొక సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. సాంకేతికతను వాడుకోవడంలో ఉగ్రసంస్థలు కొత్త దారులు వెతుకుతున్నాయని తెలిపింది..
-
బాంబుల తయారీకి AI పరిజ్ఞానం: ఉగ్రవాదులు బాంబుల తయారీ ఇంకా లక్ష్యాలను ఎంచుకోవడానికి (Target Selection) చాట్‌జీపీటీ (ChatGPT) వంటి కృత్రిమ మేధ (AI) టూల్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు ఐరాస హెచ్చరించింది.
-
ప్రచారానికి AI వాడుక: ఐసిస్ ఖొరసాన్ (ISIL-K) వంటి సంస్థలు తమ ఉగ్రవాద భావజాలాన్ని వేగంగా వివిధ భాషల్లోకి అనువాదం చేసి ప్రచారం చేయడానికి ఏఐ సాంకేతికతను వాడుకుంటున్నాయి.
-
రసాయన ఆయుధాల ముప్పు: ఉగ్రవాద గ్రూపులు సైనేడ్ వంటి ప్రాణాంతక రసాయన మరియు జీవ ఆయుధాలపై (Biological Weapons) మళ్లీ దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.
పాక్ – ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..
ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం చెలాయిస్తున్న తాలిబాన్ పాలకులు, పాకిస్తాన్‌లో దాడులు చేస్తున్న తహ్రీక్-యే-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) సంస్థకు మద్దతు ఇస్తున్నారని ఐరాస పేర్కొంది. ఫలితంగా పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో సైనిక దాడులు, ఘర్షణలు తీవ్రమయ్యాయి.
అంతర్జాతీయ భద్రతా నిబంధనలను, సాంకేతికతలను మారుస్తూ ఉగ్రవాద సంస్థలు కొత్త పంథాలో విస్తరిస్తున్నాయని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
