Who is TV Narendran

Who is TV Narendran: టాటా సన్స్ తదుపరి చైర్మన్ పగ్గాలు టీవీ నరేంద్రన్‌కేనా?

Who is TV Narendran: భారతదేశంలో అత్యంత విశ్వసనీయ పారిశ్రామిక గ్రూప్‌గా పేరుగాంచిన టాటా గ్రూప్ (Tata Group) లో గత కొన్ని రోజులుగా ఊహించని వేగంతో పరిణామాలు మారుతున్నాయి. గ్రూప్‌లోని అంతర్గత అభిప్రాయ భేదాలు, విభేదాల కారణంగా రాజీనామాల పర్వం కొనసాగుతోందనే వార్తల నడుమ.. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (N Chandrasekaran) మరొక విడత చైర్మన్ పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకోవడం కార్పొరేట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

ఆయన ప్రస్తుత పదవీ కాలం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగనున్నప్పటికీ.. టాటా సన్స్ తదుపరి పగ్గాలు చేపట్టే కొత్త నాయకుడి (Successor) అన్వేషణ ఇప్పటి నుంచే ప్రారంభమైంది. ఈ క్రమంలో టాటా గ్రూప్‌లోని అత్యంత అనుభవజ్ఞుడైన టీవీ నరేంద్రన్ (TV Narendran) పేరు ప్రముఖంగా రేసులోకి వచ్చింది.
ఎవరు ఈ టీవీ నరేంద్రన్?
61 ఏళ్ల టీవీ నరేంద్రన్ ప్రస్తుతం దిగ్గజ సంస్థ ‘టాటా స్టీల్’ (Tata Steel) కి మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టాటా గ్రూప్‌లో అత్యంత సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఆయన ఒకరు..
  • విద్యాభ్యాసం: ఎన్ఐటీ తిరుచిరాపల్లి (NIT Trichy) నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందిన ఆయన, ప్రతిష్టాత్మక ఐఐఎమ్ కలకత్తా (IIM Calcutta) నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
  • ప్రస్థానం: 1988లో టాటా స్టీల్‌లో ఒక సాధారణ ఉద్యోగిగా చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాల (40 ఏళ్లు) సుదీర్ఘ ప్రయాణంలో సేల్స్, మార్కెటింగ్, అంతర్జాతీయ వ్యాపారాలు అలాగే కీలక నాయకత్వ హోదాల్లో పనిచేశారు.
  • అంతర్జాతీయ అనుభవం: ఆయన తన కెరీర్‌లో ఎక్కువ భాగం థాయిలాండ్‌లో గడిపి, ఆగ్నేయాసియాలో టాటా స్టీల్ వ్యాపార పునాదులను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఇండియా ఆపరేషన్స్ బాధ్యతలు చేపట్టి 2013లో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎదిగారు.

చైర్మన్ రేసులో ఆయన పేరు ఎందుకు వినిపిస్తోంది?

ఎన్. చంద్రశేఖరన్ తర్వాత టాటా సన్స్‌ను నడిపించే సర్థ్యుడి కోసం జరుగుతున్న చర్చల్లో నరేంద్రన్ పేరు రావడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి..
  1. ఉత్పాదక రంగ అనుభవం: ఐటీ రంగానికి చెందిన టీసీఎస్ (TCS) నుంచి వచ్చి చైర్మన్ అయిన ఎన్. చంద్రశేఖరన్‌తో పోలిస్తే.. నరేంద్రన్ గ్రూప్‌లోని పక్కా మ్యానుఫ్యాక్చరింగ్, కోర్ పారిశ్రామిక రంగానికి చెందిన నాయకుడు.
  2. కష్టకాలంలో సంస్థను నడిపిన తీరు: నరేంద్రన్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో టాటా స్టీల్ తీవ్ర అప్పుల్లో ఉండటంతో పాటు అంతర్జాతీయ స్టీల్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంది. ఆ సమయంలో క్యాష్ ఫ్లో పెంచడం, అప్పులు తగ్గించడం ఇంకా యూరప్ ఆపరేషన్స్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి కంపెనీని లాభాల బాట పట్టించారు.
  3. టాటా సంస్కృతిపై పట్టు: దశాబ్దాలుగా గ్రూప్‌లోనే కొనసాగడం వల్ల టాటా విలువలు, సంస్కృతిపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది.

ఎంపిక ప్రక్రియ మరియు ముందనున్న సవాళ్లు..

అయితే, కేవలం చర్చల్లో ఆయన పేరు ఉన్నంత మాత్రాన ఆయనే ఖాయమని చెప్పలేం. టాటా సన్స్‌లో రెండు వంతుల (2/3rd) కంటే ఎక్కువ వాటా కలిగిన ‘టాటా ట్రస్ట్స్’ (Tata Trusts) ప్రమేయంతో కూడిన ప్రత్యేక బోర్డు ఎంపిక ప్రక్రియ ద్వారా నూతన చైర్మన్‌ను ఖరారు చేస్తారు.

తదుపరి రాబోయే చైర్మన్ ఎవరైనా సరే.. ఎయిర్ ఇండియా (Air India) పునర్నిర్మాణం, సెమీకండక్టర్ తయారీ రంగాలు, టాటా క్యాపిటల్ ఇంకా టీసీఎస్ వంటి భారీ వ్యాపారాల ముందున్న సవాళ్లను సమర్థవంతంగా నడిపించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నరేంద్రన్ పేరు తెరపైకి రావడం అనేది అనౌన్స్‌మెంట్ కంటే కూడా టాటా సన్స్ కోరుకుంటున్న సమర్థవంతమైన సంస్థాగత నాయకుడి లక్షణాలకు అద్దం పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *