CCTV: ఈ రోజుల్లో సీసీటీవీ (CCTV) కెమెరాలు అమర్చుకోవడం అనేది కేవలం ఒక విలాసం కాదు.. భద్రతకు అత్యంత అవసరంగా మారింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో సొంతిల్లు అయినా, అద్దె ఇల్లు అయినా సెక్యూరిటీ కోసం కెమెరాలు పెట్టడం సర్వసాధారణమైంది.
అయితే, ఇటీవల అద్దె ఇళ్లలో సీసీటీవీల ఏర్పాటుపై ఓనర్లు, అద్దెదారుల మధ్య వివాదాలు పెరిగి కోర్టుల వరకు వెళ్తున్నాయి. ఇంటి ఓనర్‌గా నా ఆస్తిలో ఎక్కడైనా సీసీటీవీలు పెట్టుకునే హక్కు నాకు ఉందా? లేదా అద్దెకు ఉండే వారి ప్రైవసీకి భంగం కలిగించేలా కెమెరాలు పెట్టవచ్చా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ప్రైవసీ వర్సెస్ సెక్యూరిటీ.. చట్టాలు ఏం చెబుతున్నాయి?
సాధారణంగా ఇంటి భద్రత కోసం ఓనర్లకు సీసీటీవీ కెమెరాలు అమర్చుకునే హక్కు ఉంటుంది. కానీ, దానికీ కొన్ని పరిమితులు ఉన్నాయి..
-
సరైన ఉద్దేశం ఉండాలి: అపార్ట్‌మెంట్ మెయిన్ గేట్, కారిడార్లు, పార్కింగ్ స్థలాలు, కంబైన్డ్ ఎంట్రీల వద్ద భద్రతా కారణాల దృష్ట్యా కెమెరాలు ఏర్పాటు చేయడం చట్టబద్ధమే.
-
ప్రైవసీకి భంగం కలగొద్దు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కుతో పాటు ‘గోప్యతా హక్కు’ (Right to Privacy) ప్రాథమిక హక్కుగా ఉంటుంది. అద్దెదారులు ఉండే పోర్షన్, బాల్కనీలు లేదా బెడ్‌రూమ్, హాల్ వంటి ప్రైవేట్ ప్రాంతాలు కనిపించేలా కెమెరాలు అమర్చడం తీవ్రమైన చట్ట ఉల్లంఘన కిందకు వస్తుంది.
కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు: ఓనర్లకు హెచ్చరిక!
గతంలో కలకత్తా హైకోర్టులో అద్దె ఇళ్ల సీసీటీవీ వివాదంపై ఒక కీలక కేసు విచారణకు వచ్చింది.
ఒక ఇంటి యజమాని తన ఆస్తి రక్షణ కోసం 15 సీసీటీవీలు అమర్చాడు. అందులో 5 కెమెరాలు నేరుగా అద్దెదారుల ఇంటి ప్రవేశ దారిని, వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించేలా ఉన్నాయి. దీనికి అద్దెదారులు మొదట అనుమతి ఇచ్చినప్పటికీ.. “ఓనర్ అనుమతి తీసుకున్నంత మాత్రాన లేదా ఇల్లు తనదే అయినంత మాత్రాన అద్దెదారుడి వ్యక్తిగత జీవితాన్ని నిఘా పెట్టేందుకు అపరిమితమైన హక్కులు రావు” అని స్పష్టం చేస్తూ కోర్టు అద్దెదారులకే అనుకూలంగా తీర్పునిచ్చింది.
అంతేకాకుండా, 1882 ఆస్తి బదిలీ చట్టం (Transfer of Property Act) సెక్షన్ 108 ప్రకారం కౌలుదారు (అద్దెదారుడు) ఓనర్ ఆస్తిలో ఎలాంటి భయం, ఇబ్బంది లేకుండా శాంతియుతంగా నివసించే హక్కును కలిగి ఉంటాడు.
ఐటీ యాక్ట్ ప్రకారం రూ. 2 లక్షల జరిమానా, జైలు శిక్ష!
భారత సమాచార సాంకేతిక చట్టం (IT Act), 2000లోని సెక్షన్ 66E ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ స్థలంలో వారి ప్రమేయం లేదా అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు తీయడం లేదా నిఘా పెట్టడం తీవ్రమైన నేరం.
-
శిక్ష వివరాలు: ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే గరిష్ఠంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది.
భద్రత కోసం కారిడార్లు లేదా మెయిన్ గేట్ వద్ద సీసీటీవీ పెట్టడానికి.. అద్దెదారుల వ్యక్తిగత జీవితంపై నిఘా పెట్టడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇంటి రక్షణ ఎంత ముఖ్యమో, ఎదుటివారి ప్రైవసీని గౌరవించడం కూడా అంతే ముఖ్యం!
