Cheyutha Pension: తెలంగాణలోని నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు అలాగే వివిధ రకాల బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను శనివారం (ఆగస్టు 8, 2026) నుండి అధికారికంగా ప్రారంభించింది.
రాబోయే స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) నాటికి అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి చివరి తేదీ (లాస్ట్ డేట్) లేదని స్పష్టం చేసింది.
ఎవరికి మొదటి ప్రాధాన్యం?
నూతన పింఛన్ల మంజూరులో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక వర్గాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది..
-
మొదటి ప్రాధాన్యం: ఒంటరి మహిళలు, వితంతువులు.
-
వృత్తిదారులు & బాధితులు: గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా (బోదకాలు), డయాలసిస్ బాధితులు.
-
దివ్యాంగుల ప్రత్యేక కేటగిరీ: థలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా వ్యాధులతో బాధపడుతున్న వారు.
అర్హతలు & అనర్హతలు ఏమిటి?
అర్హతలు:
-
ఆదాయ పరిమితి: కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
-
భూమి పరిమితి: మాగాణి భూమి 3 ఎకరాల కంటే తక్కువ, మెట్ట భూమి 7.5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి.
అనర్హులు ఎవరు?:
-
ప్రభుత్వ, ప్రైవేటు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు.
-
రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్గుల యజమానులు మరియు వారి తల్లిదండ్రులు.
-
సొంతంగా నాలుగు చక్రాల వాహనాలు (ఫోర్ వీలర్స్), భారీ వాహనాలు ఉన్నవారు.
-
ఇప్పటికే ఏదైనా ప్రభుత్వ లేదా స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న కుటుంబాలు.
దరఖాస్తు ప్రక్రియ – ఎలా అప్లై చేయాలి?
-
పాత దరఖాస్తుదారులు: గతంలోనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అయితే, తమ దరఖాస్తు రికార్డుల్లో ఉందో లేదో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారుల వద్ద ఒకసారి ధృవీకరించుకోవాలి.
-
కొత్తగా అప్లై చేసేవారు: చేయూత అధికారిక వెబ్సైట్ నుంచి ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని..
-
గ్రామాల్లో: పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీఓ (MPDO) కార్యాలయంలో అందజేయాలి.
-
పట్టణాల్లో: బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు లేదా మున్సిపల్ కమిషనర్లకు సమర్పించాలి.
-
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేస్తామని, ఏమైనా అనుమానాలు ఉంటే స్థానిక పంచాయతీ లేదా పురపాలక అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.
