Meta: సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ)కు కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లలు, టీనేజర్ల భద్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా, వారిని సోషల్ మీడియా అడిక్షన్‌కు గురిచేసి మానసిక ఆరోగ్యానికి హాని కలిగించినందుకుగానూ న్యూ మెక్సికో రాష్ట్ర కోర్టు మెటాకు చారిత్రాత్మక శిక్ష విధించింది.
న్యాయమూర్తి బ్రయాన్ బీడ్‌షీడ్ (Bryan Biedscheid) తీర్పు వెలువరిస్తూ.. టీనేజర్ల మానసిక ఆరోగ్య నిధికి మరియు నష్టపరిహారంగా 567 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.4,700 కోట్లు) చెల్లించాలని మెటాను ఆదేశించారు.
రెండు దశల విచారణ – మొత్తం జరిమానా రూ.7,800 కోట్లు!
న్యూ మెక్సికో అటార్నీ జనరల్ రౌల్ టోరెజ్ దాఖలు చేసిన ఈ సంచలన కేసు విచారణ రెండు దశల్లో సాగింది:
-
మొదటి దశ (మార్చి): ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లు పిల్లలకు సురక్షితమైనవని అబద్ధపు ప్రచారం చేస్తూ వినియోగదారులను మోసం చేశాయని తేలడంతో జ్యూరీ కోర్టు 375 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,100 కోట్లు) జరిమానా విధించింది.
-
రెండో దశ (తాజా తీర్పు): తాజాగా ‘పబ్లిక్ న్యూసెన్స్’ (సమాజానికి ముప్పు) కలిగిస్తున్నారని నిర్ధారిస్తూ మరో 567 మిలియన్ డాలర్లను చెల్లించాలని జడ్జి ఆదేశించారు.
దీంతో ఈ ఒక్క కేసులోనే మెటా చెల్లించాల్సిన మొత్తం జరిమానా 942 మిలియన్ డాలర్లకు (మన కరెన్సీలో సుమారు రూ.7,800 కోట్లు) చేరింది. కోర్టు ఆదేశాల ప్రకారం, ఇందులో 420 మిలియన్ డాలర్లను సోషల్ మీడియా అడిక్షన్ మరియు మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లల చికిత్స, పునరావాసం కోసం ఉపయోగించనున్నారు.
కోర్టు విధించిన 5 ఏళ్ల కఠిన నిబంధనలు!
కేవలం జరిమానాతో సరిపెట్టకుండా, రాబోయే ఐదేళ్ల పాటు మెటా తన ఫీచర్లలో కొన్ని కీలక మార్పులు చేయాలని కోర్టు ఆదేశించింది:
-
వాడకంలో పరిమితులు: టీనేజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాడే సమయంపై నెలవారీ పరిమితులు (Monthly limits) విధించాలి.
-
నోటిఫికేషన్లు & కాంటాక్ట్ కంట్రోల్: నోటిఫికేషన్లపై ఆంక్షలు విధించడంతో పాటు, మైనర్లతో పెద్దలు నేరుగా కాంటాక్ట్ కాకుండా పటిష్టమైన కంట్రోల్స్ తేవాలి.
-
AI చాట్‌బాట్‌లపై ఆంక్షలు: పిల్లలతో ఏఐ (AI) చాట్‌బాట్‌లు అభ్యంతరకరమైన, లైంగిక సంభాషణలు జరపకుండా అడ్డుకోవాలి.
“ఇది లాభాల కోసం పిల్లల భద్రతను తాకట్టు పెట్టడమే”
“మెటా లాభాల కోసం పిల్లల ప్రాణాలను, భద్రతను పక్కన పెట్టింది. ఈ తీర్పు కేవలం ఒక కంపెనీకి మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పిల్లల భద్రత కోసం పోరాడుతున్న మిగతా రాష్ట్రాలకు, దేశాలకు ఒక రోడ్‌మ్యాప్‌గా నిలుస్తుంది.”— రౌల్ టోరెజ్ (న్యూ మెక్సికో అటార్నీ జనరల్)
మరోవైపు కోర్టు తీర్పును అంగీకరించని మెటా ప్రతినిధులు.. తమ ప్లాట్‌ఫారమ్‌లలో టీనేజర్ల భద్రతకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ నిర్ణయంపై పైకోర్టులో (అప్పీల్) సవాలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం అమెరికావ్యాప్తంగా 40కి పైగా రాష్ట్రాలు, 1,300కు పైగా పాఠశాల జిల్లాలు సోషల్ మీడియా కంపెనీలపై కేసులు నమోదు చేయడంతో ఈ తీర్పు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
