AP Cabinet

AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ‘దిశ’, ‘ల్యాండ్ గ్రాబింగ్’ బిల్లులు రద్దు..!

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ (క్యాబినెట్) సమావేశం ముగిసింది. మూడున్నర గంటలకు పైగా సాగిన ఈ సుదీర్ఘ భేటీలో మొత్తం 34 అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. సమావేశం అనంతరం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026’ తో పాటు ‘ఏపీ పీపీపీ పాలసీ-2026’ ముసాయిదాకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

పాత బిల్లుల ఉపసంహరణ – పటిష్ట చట్టాల రూపకల్పన

గత ప్రభుత్వ హయాంలో సరైన కేంద్ర అనుమతులు లేకుండా తీసుకొచ్చిన ‘దిశా బిల్లు-2019’, అలాగే ‘ల్యాండ్ గ్రాబింగ్ (భూ ఆక్రమణల) బిల్లు-2024’ లను ఉపసంహరించుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రజల భద్రత, భూముల రక్షణ కోసం త్వరలోనే వీటన్నింటి స్థానంలో మరింత పటిష్టమైన నూతన చట్టాలను రూపొందించనున్నట్లు స్పష్టం చేసింది.
అమరావతి అభివృద్దికి భారీ కేటాయింపులు:
క్యాబినెట్ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి పలు ప్రాజెక్టులకు నిధుల ఆమోదం లభించింది..
  • క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్: అమరావతిలో నిర్మించబోయే ‘క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్’ ప్రాజెక్టుకు ₹1,002.49 కోట్లు కేటాయించారు. ఈ నిర్మాణ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ (L&T) కి అప్పగించేందుకు అంగీకారం తెలిపింది.
  • డిజైన్లు & రీ-టెండర్లు: హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్ల కోసం అదనపు నిధులు మంజూరు చేయడంతో పాటు ‘అమరావతి ఐ’ (Amaravati Eye) ప్రాజెక్టుకు రీ-టెండర్లు పిలవాలని నిర్ణయించింది.
  • భూ కేటాయింపులు: అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రుల బృందం (GoM) చేసిన సిఫార్సులకు ఆమోదముద్ర పడింది.

సమాజం, విద్య, మౌలిక వసతులలో ఇతర ముఖ్య నిర్ణయాలు:

రంశం క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయం
విద్యా రంగం కొత్త జిల్లాల కోసం 15 కొత్త డీఈఓ (DEO) పోస్టుల సృష్టి. రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి.
పాదచారుల భద్రత ‘పాదచారుల భద్రత పాలసీ-2026’ కు ఆమోదం. నూతన రోడ్ల నిర్మాణంలో నడిచేవారి రక్షణకు ప్రాధాన్యం.
గోదావరి పుష్కరాలు పుష్కర ఘాట్‌ల అభివృద్ది కోసం ₹210.06 కోట్లు కేటాయింపు.
పరిశ్రమలు & నెట్‌వర్క్ టెక్స్‌టైల్స్ పాలసీలో వేతన సబ్సిడీల సవరణ. మొబైల్ టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు, రాయితీ విద్యుత్ అందించేందుకు గ్రీన్ సిగ్నల్.
పట్టణాభివృద్ధి ఆర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల (UDA) పునర్వ్యవస్థీకరణ, మున్సిపల్ భూముల లీజు గడువు పెంపునకు చట్టసవరణ.

రాష్ట్రంలో పారదర్శకమైన పాలన అందించడమే కాకుండా, మౌలిక వసతుల కల్పన ద్వారా ఉద్యోగావకాశాలు పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *