Udhayanidhi Stalin-Vijay

Udhayanidhi Stalin-Vijay: కావేరీ సభలో నటి త్రిషపై ఉదయనిధి కామెంట్స్.. జాతీయ మహిళా కమిషన్‌కు ఎక్కిన టీవీకే!

Udhayanidhi Stalin-Vijay: ఒకవైపు కావేరీ నదీ జలాల పంపిణీపై తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తుతుంటే, మరోవైపు ఈ ఉద్యమం కాస్త రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత విమర్శలకు, తీవ్ర వివాదాలకు వేదికగా మారింది. తంజావూరులో జరిగిన నిరసన సభలో డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.. నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటమే కాకుండా ఏకంగా జాతీయ మహిళా కమిషన్‌కు (NCW) ఫిర్యాదు చేసింది.

సభలో అసలు ఏం జరిగింది?

కావేరీ జలాల విషయంలో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తంజావూరులో ఉదయనిధి విమర్శలు గుప్పిస్తుండగా ఈ ఘటన జరిగింది. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో సీఎం విజయ్ విఫలమయ్యారని ఆయన మాట్లాడుతుండగా.. సభలోని కొందరు కార్యకర్తలు హఠాత్తుగా “త్రిష.. త్రిష” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీంతో తన ప్రసంగాన్ని ఆపిన ఉదయనిధి నవ్వుతూ.. “నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా, అక్కడికి మాత్రం చేరాలి” అని ద్వంద్వార్థం (Double Entendre) వచ్చేలా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తాను మాట్లాడింది కావేరీ నదీ జలాల గురించేనని నవ్వుతూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆ మాటలు నటి త్రిష, సీఎం విజయ్‌లను ఉద్దేశించి చేసిన చౌకబారు వ్యాఖ్యలేనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

“ఇది దిగజారిన రాజకీయం” – టీవీకే, బీజేపీ ఫైర్!

ఉదయనిధి వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో అధికార టీవీకే, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు..

  • టీవీకే విమర్శలు: టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్ స్పందిస్తూ.. ఉదయనిధి వ్యాఖ్యలు అత్యంత అసహ్యకరంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. కావేరీ నిరసనలు విఫలమవడంతో కేవలం సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం, చౌకబారు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందాలని డీఎంకే చూస్తోందని విమర్శించారు.

  • బీజేపీ డిమాండ్: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి ఈ ప్రవర్తనను సిగ్గుచేటని అభివర్ణించారు. మహిళల పట్ల అభ్యంతరకరంగా మాట్లాడిన ఉదయనిధిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్ కొడుకు ప్రవర్తనపై నోరు విప్పకపోవడం ఆశ్చర్యకరమని విమర్శించారు.

జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

ఈ వివాదాన్ని టీవీకే పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్‌కు (NCW) లేఖ రాసింది.

ఉదయనిధి స్టాలిన్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయనపై పోలీసులు పబ్లిక్ అబ్సీనిటీ (బహిరంగంగా అసభ్యత) కింద కేసు నమోదు చేయాలని టీవీకే డిమాండ్ చేసింది. ఒక పక్క కావేరీ నీటి రచ్చ నడుస్తుండగా.. ఈ వ్యక్తిగత వ్యాఖ్యల వివాదం తమిళనాడు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *