Gas Cylinder

Gas Cylinder: హైదరాబాద్‌లో కొత్త గ్యాస్ కనెక్షన్ల కష్టం.. పెరుగుతున్న కరెంట్ బిల్లు

Gas Cylinder: హైదరాబాద్ మహానగరంలో సొంతింటి వంట గ్యాస్ కనెక్షన్ సంపాదించడం ఇప్పుడు సామాన్యులకు ఓ పెద్ద సమస్యగా మారింది.  కొత్త ఎల్పీజీ (LPG) కనెక్షన్ ఇవ్వకపోవడం, ఉన్న సిలిండర్‌కు తోడు రెండో సిలిండర్ (DBC) తీసుకుందామంటే ఏజెన్సీలు నిరాకరిస్తుండటంతో భాగ్యనగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒకప్పుడు ఇంటింటికీ వచ్చి “కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోండి” అంటూ ఆఫర్లు ఇచ్చిన ఏజెన్సీలే.. ఇప్పుడు దరఖాస్తు పట్టుకుని వెళ్తే చేతులెత్తేస్తుండటం గమనార్హం.

మూడు నెలలుగా అప్రకటిత నిషేధం!

గడిచిన మూడు నెలలుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ల జారీ పూర్తిగా నిలిచిపోయింది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు ఇంకా యుద్ధ పరిణామాల కారణంగా చమురు సంస్థల నుంచి స్పష్టమైన అనుమతులు రావడం లేదని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు.

  • సరఫరా ఉందంటున్నా కనెక్షన్లు లేవు: మార్కెట్‌లో ఎల్పీజీ గ్యాస్ నిల్వల కొరత లేదని అధికారులు పైకి చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం కొత్త అనుమతులు మంజూరు చేయడం లేదు.

  • రెండో సిలిండర్‌కూ ‘నో’: ఒకే సిలిండర్ ఉండి అది అయిపోతే.. కొత్త రీఫిల్ వచ్చే వరకు వారం నుంచి పది రోజులు ఆగాల్సి వస్తోంది. ఈ ఇబ్బంది లేకుండా ‘డబుల్ సిలిండర్’ కోసం అప్లై చేసుకుంటున్న వినియోగదారుల దరఖాస్తులను కూడా ఏజెన్సీలు పెండింగ్‌లో పెడుతున్నాయి.

కొత్త కాపురాలు, ఐటీ ఉద్యోగులపై చురకలు!

ఈ అప్రకటిత నిషేధం వల్ల నగరంలో కొత్తగా కాపురం పెట్టిన జంటలు, వేర్వేరుగా ఉంటున్న కుటుంబాలు, ఉద్యోగాలు మరియు చదువుల కోసం నగరానికి వచ్చిన వేలాది మంది తీవ్రంగా నష్టపోతున్నారు.

  • కరెంట్ బిల్లుల భారం: ఐటీ కారిడార్లయిన కొండాపూర్, కేపీహెచ్‌బీ, నార్సింగి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో కొత్త కనెక్షన్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. గ్యాస్ దొరక్కపోవడంతో గత్యంతరం లేక ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లపై ఆధారపడుతున్నారు. దీనివల్ల నెల తిరిగేసరికి కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పష్టత ఇవ్వని చమురు సంస్థలు

గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం లక్షలాది ఎల్పీజీ కనెక్షన్లు, వందలాది ఏజెన్సీలు ఉన్నాయి. కానీ, అసలు కొత్త కనెక్షన్లు, రెండో సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారనే దానిపై గ్యాస్ కంపెనీల నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రావడం లేదు. ఈ అనిశ్చితిని వెంటనే తొలగించి, ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని హైదరాబాద్ ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *