Raghav Chadha

Raghav Chadha: నా బాధ్యత ప్రశ్నలు అడగడం కాదు.. పరిష్కారం చూపడం!

Raghav Chadha: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా గురువారం సభలో ఘాటుగా స్పందించారు. ఇప్పటివరకు ఈ సున్నితమైన అంశంపై తాను ఎందుకు మౌనంగా ఉన్నానో వివరిస్తూ, ‘యాంటీ పేపర్ లీక్ బిల్లు’పై జరిగిన చర్చలో పవర్ ఫుల్ ప్రసంగం చేశారు.

మీడియా మైకుల ముందు మాట్లాడటం వల్లనో, వార్తల్లో హెడ్‌లైన్స్‌లోకి ఎక్కడం వల్లనో ఈ సమస్య తీరదని, వ్యవస్థలోనే మూలమట్టంగా మార్పులు తెచ్చినప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అప్పుడు ప్రశ్నలు అడిగాను.. ఇప్పుడు పరిష్కారం చూపుతున్నాను

కాంగ్రెస్‌తో పాటు తన పాత పార్టీ ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. విపక్షంలో ఉన్నప్పటికి, అధికార పక్షానికి వచ్చాక తన బాధ్యతల్లో వచ్చిన మార్పును రాఘవ్ చద్దా స్పష్టం చేశారు..

“గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ప్రశ్నలు అడగడం నా బాధ్యత.. దానిని ఎంతో ప్రామాణికంగా చేశాను. కానీ ఇప్పుడు నేను అధికార పక్షంలో ఉన్నాను. ఇప్పుడు నా బాధ్యత కేవలం నిలదీయడం కాదు, సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించడం! మన వ్యవస్థలోని లోపాలను సరిచేసే రోజు వస్తుందనే నమ్మకంతోనే ఇన్నాళ్లూ వేచి చూశాను. ఆ చారిత్రాత్మక రోజే ఇది! 

మీ ఆగ్రహం, ఆవేదన 100% న్యాయమైనవి!

ఈ క్రమంలో రాత్రింబవళ్లు కష్టపడి చదివే విద్యార్థులకు ఆయన ఓ భావోద్వేగ సందేశాన్ని ఇచ్చారు.

  • కుటుంబాల కలలు: నీట్ పరీక్ష రాసే ప్రతి అభ్యర్థి వెనుక ఒక సగటు కుటుంబపు భవిష్యత్తు కలలు దాగి ఉంటాయని పేర్కొన్నారు.

  • తల్లిదండ్రుల త్యాగం: కోటా, ఢిల్లీ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ సెంటర్ల ఫీజుల కోసం తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని వెచ్చిస్తారని.. సొంత సామాజిక, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి చదువుకుంటారని గుర్తుచేశారు.

  • భరోసా: మీ కోపం, మీ కన్నీళ్లు, మీ ఆవేదన 100% సమర్థనీయమైనవి. విద్యార్థుల ఆవేదనను ప్రధాని నరేంద్ర మోదీ ఒక కుటుంబ పెద్దగా, సంరక్షకుడిగా విన్నారు అని హామీ ఇచ్చారు.

కీలక నిర్ణయాలు & వేగవంతమైన విచారణ

ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న పక్కా చర్యలను ఎంపీ వెల్లడించారు.

  1. 75 రోజుల్లోనే ఛార్జిషీట్: నీట్ అక్రమాలపై దర్యాప్తును వేగవంతం చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేవలం 75 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశామని తెలిపారు.

  2. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT): భవిష్యత్తులో నీట్ పరీక్షలను పాత ఓఎమ్‌ఆర్ (OMR) షీట్లతో కాకుండా, పూర్తి పారదర్శకంగా ఉండే కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలోనే నిర్వహిస్తామని ప్రకటించారు.

‘పేపర్ లీకేజీ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి’

పేపర్ లీక్‌లను ఏ రాజకీయ కోణంలోనో, పార్టీ ప్రయోజనాల కోసమో చూడకూడదని.. అది దేశ విద్యా వ్యవస్థను వేధిస్తున్న ఒక రోగమని రాఘవ్ చద్దా అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రంలో లీక్ అయింది, అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉందనేది ముఖ్యం కాదని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో కాంగ్రెస్, ఆప్ పాలిత రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన పంజాబ్ ఫార్మసీ ఆఫీసర్ పరీక్షలో బ్లూటూత్ మోసాలు, కర్ణాటకలో జులై, జనవరి నెలల్లో జరిగిన క్వశ్చన్ పేపర్ లీకేజీల ఉదాహరణలను ప్రస్తావించారు. దేశంలో కష్టపడి చదివే ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ, ఈ నూతన బిల్లుకు రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *