CWG 2026

CWG 2026: భారత్‌కు మరో రెండు పతకాలు.. జావెలిన్ ఫైనల్లో నీరజ్ చోప్రా ట్రిపుల్ ధమాకా!

CWG 2026: స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరుగుతున్న కమన్‌వెల్త్ గేమ్స్ 2026 (CWG 2026) లో 8వ రోజు భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గురువారం జరిగిన పోటీల్లో భారత్ మరో రెండు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఒక రజతం (సిల్వర్), అథ్లెటిక్స్ విభాగంలో ఒక కాంస్యం (బ్రాంజ్) భారత్‌కు లభించాయి.

ఈ రెండు పతకాలతో కలిపి భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 17 కి (3 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) చేరింది. కాగా, పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం 10వ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 110 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

వెయిట్‌లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్ రికార్డు రజతం!

పురుషుల 110 కేజీలకు పైబడిన వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్లో లవ్‌ప్రీత్ సింగ్ అద్భుత పోరాటపటిమ కనబరిచాడు. స్నాచ్ రౌండ్‌లో 176 కేజీలు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు సృష్టించిన లవ్‌ప్రీత్, క్లీన్ అండ్ జెర్క్‌లో 212 కేజీలతో కలిపి మొత్తం 388 కేజీల బరువును విజయవంతంగా ఎత్తాడు.

చివరి క్షణం వరకు లవ్‌ప్రీత్ స్వర్ణం గెలుస్తాడని భావించినా, న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ లిటి అనూహ్యంగా 223 కేజీలు ఎత్తి, కేవలం 1 కేజీ తేడాతో (389 కేజీలు) గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. దీంతో లవ్‌ప్రీత్ సింగ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో వెయిట్‌లిఫ్టింగ్ నుంచే భారత్‌కు ఏకంగా 8 పతకాలు రావడం విశేషం.

డిస్కస్ త్రోలో సీమా కలీరామ్నాకు కాంస్యం

మహిళల డిస్కస్ త్రో పోటీల్లో ఇద్దరు భారత అథ్లెట్ల మధ్య కాంస్య పతకం కోసం ఆసక్తికరమైన పోరు సాగింది. భారత అథ్లెట్ సీమా కలీరామ్నా తన మూడో ప్రయత్నంలో 58.65 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని ముద్దాడింది. భారత్‌కే చెందిన మరో అథ్లెట్ నిధి రాణి (57.10 మీటర్లు) నాల్గో స్థానానికి పరిమితమై తృటిలో పతకాన్ని చేజార్చుకుంది.

జావెలిన్ ఫైనల్లో నీరజ్ చోప్రా ట్రిపుల్ ధమాకా!

రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా గాయం కారణంగా గత కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యాడు. అయితే ఈసారి తిరిగొచ్చిన నీరజ్, క్వాలిఫైయింగ్ రౌండ్‌లో 79.61 మీటర్ల ఈటెను విసిరి ఈజీగా ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

విశేషమేమిటంటే.. నీరజ్‌తో పాటు భారత్‌కే చెందిన రోహిత్ యాదవ్ (78.37 మీటర్లు), యష్ వీర్ సింగ్ (78.36 మీటర్లు) కూడా ఫైనల్‌కు అర్హత సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో ముగ్గురు భారత అథ్లెట్లు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం!

ఇతర రౌండ్లలో ఆకట్టుకున్న మనోళ్లు:

  • డెకాథ్లాన్: మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ నేషనల్ రికార్డ్ హోల్డర్ తేజస్విన్ శంకర్ అద్భుత ప్రదర్శన చేశాడు. లాంగ్ జంప్‌లో తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును (7.82 మీటర్లు) నమోదు చేసి, తొలి రోజు ముగిసేసరికి 4,339 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి పతక రేసులో నిలిచాడు.

  • ట్రిపుల్ జంప్: ప్రవీణ్ చిత్రవేల్ (16.46 మీటర్లు), సెల్వ ప్రభు (16.21 మీటర్లు) ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు.

  • లాన్ బౌల్స్: పురుషుల పెయిర్స్ విభాగంలో భారత జట్టు బొట్స్వానాను 1-0 తేడాతో ఓడించి ముందంజ వేసింది.

9వ రోజు జరగబోయే పోటీల్లో నీరజ్ చోప్రా జావెలిన్ ఫైనల్, తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్ ఈవెంట్లతో పాటు బాక్సింగ్ సెమీఫైనల్స్ జరగనున్నాయి. సెమీస్ చేరిన భారత బాక్సర్లందరికీ ఇప్పటికే పతకాలు ఖాయమవ్వగా, గోల్డ్ మెడల్స్ కోసం వారు పోరాడనున్నారు.

India At Commonwealth Games 2026 Medal Tally: Where Does IND Stand After Day 8?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *