Middle East War

Middle East War: మళ్లీ రగులుతున్న పశ్చిమాసియా..హుకూమ్‌తో దిగిన అమెరికా..!

Middle East War: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో దాదాపు వారం రోజుల పాటు క్షిపణుల సవ్వడి ఆగడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. హార్ముజ్ జలసంధి వేదికగా దాడుల పర్వం నడిచాక, అమెరికా-ఇరాన్‌లు ఒక ఒప్పందానికి వచ్చాయని.. ముందస్తుగా ఎవరూ దాడికి తెగబడరని అంతా ఊహించారు. కానీ, ఆ తాత్కాలిక శాంతి ఎక్కువ రోజులు నిలవలేదు.

జూలై 28న జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ అనూహ్యంగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడటంతో యుద్ధ వాతావరణం మళ్లీ మొదటికి వచ్చింది. ఈసారి ఇరాన్ వేసిన తప్పటడుగు ఈ రగిలే పోరును సరికొత్త మలుపు తిప్పింది.

క్షమాపణలు లేవు.. దండయాత్రే!

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జోర్డాన్‌లోని ‘మువఫ్ఫాక్ సాల్టి’ ఎయిర్ బేస్, ఇతర అమెరికా సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఐదు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే అమెరికా, జోర్డాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని గాల్లోనే అడ్డుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

గతంలో అమెరికా దాడులకు సమాధానంగా మాత్రమే ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్, ఈసారి మాత్రం ఎలాంటి ముందస్తు దాడి లేకపోయినా తానే స్వయంగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇరానే కావాలని యుద్ధాన్ని కొనసాగించాలని చూస్తోందనే అభిప్రాయం వాషింగ్టన్‌లో బలపడింది.

ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “మేము వారిని కోలుకోలేని దెబ్బ తీస్తాం.. అత్యంత ఘోరంగా బుద్ధి చెబుతాం” అని ఫాక్స్ న్యూస్ వేదికగా హెచ్చరించారు.

ఇరాన్ గుండెల్లో అమెరికా రీ-ఎంట్రీ!

ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌లోని లోతైన ప్రాంతాలపై భారీ ఎత్తున విరుచుకుపడింది. IRGC కి చెందిన కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలు, తీరప్రాంత నిఘా కేంద్రాలు మరియు వ్యూహాత్మక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. తమ దళాలకు, నౌకలకు ఇరాన్ నుంచి ఇకపై ముప్పు లేకుండా చేసేందుకే ఈ నమూనా దాడి జరిపినట్లు అమెరికా స్పష్టం చేసింది.

వ్యూహం తప్పిందా.. ఇరాన్ ఏమనుకుంటోంది?

ఇప్పటివరకు తమను తాము కాపాడుకోవడానికి, అమెరికా ఒత్తిళ్లకు నిరసనగా మాత్రమే దాడులు చేస్తున్నామని చెప్పుకొచ్చిన ఇరాన్, ఈసారి ముందుగా దాడి చేసి తన స్వయంకృత అపరాధాన్ని కొని తెచ్చుకుంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సైనిక బలాన్ని ప్రదర్శించాలనుకున్న ఇరాన్ వ్యూహం, అమెరికాకు పెద్ద ఎత్తున విరుచుకుపడటానికి సరైన నెపంగా మారింది.

“ఒకవేళ దాడి చేయడమే ఏకైక మార్గమని భావిస్తే.. ముందుగా దాడులకు దిగడానికి కూడా వెనుకాడబోమని ఇరాన్ తన శైలిని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది” అని జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ సెక్యూరిటీ అఫైర్స్ పరిశోధకుడు హమీద్రేజా అజీజీ విశ్లేషించారు.

మొత్తానికి పశ్చిమాసియాలో దౌత్య చర్చలకు తలుపులు తెరుచుకుంటాయనుకున్న ప్రశాంతత కేవలం ‘ఇంటర్వెల్’ మాత్రమేనని తేలిపోయింది. ఇరాన్ క్షిపణుల సవ్వడితో ప్రారంభమైన ఈ మలిపోరు ఎక్కడికి దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *