Ramayana Trailer: యుగాలు మారినా, తరాలు మారినా మళ్లీ మళ్లీ వినాలనిపించే పవిత్ర గాథ ‘రామాయణం’. ఈ అజరామరమైన మహాకావ్యాన్ని నేటితరం మెచ్చేలా, హాలీవుడ్ స్థాయిలో తెరపైకి తెస్తున్నారు దర్శకుడు నితీశ్ తివారీ. అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న ‘రామాయణ‘ మూవీ ట్రైలర్ బ్రహ్మ ముహూర్తంలో విడుదలై సోషల్ మీడియాను ఊపేస్తోంది.
అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణం, ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ మరియు హాన్స్ జిమ్మర్ల నేపథ్య సంగీతంతో నాలుగు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఒక్కసారిగా త్రేతాయుగానికి తీసుకెళ్లింది.
ట్రైలర్లో మెరిసిన ప్రధాన విశేషాలు..
-
రావణాసురుడిగా ‘యష్’ గాంభీర్యం: “ముల్లోకాల్లో ఇక ఉండేది ఒక్కటే సామ్రాజ్యం.. అది రావణ రాజ్యం” అనే డైలాగ్‌తో కన్నడ రాకింగ్ స్టార్ యష్ స్క్రీన్ పైకి రాగానే ఆయన గంభీరమైన రూపం, నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
-
శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్: ధర్మనిష్ఠ, అత్యంత ప్రశాంతతను ప్రతిబింబించే శ్రీరాముని పాత్రలో రణ్‌బీర్ కపూర్ చక్కగా ఒదిగిపోయారు. శివధనుస్సును విరవడమే కాకుండా, పరశురాముడి పాత్రలోనూ రణ్‌బీర్ కనిపించడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్!
-
ఖడ్గం పట్టిన యోధురాలిగా సీతమ్మ: మృదుస్వభావిగా ఉండే సీతాదేవిని (సాయి పల్లవి) ఇందులో సరికొత్తగా ఖడ్గం పట్టిన యోధురాలిగా చూపించడం విశేషం.
-
కళ్లకట్టిన దృశ్యాలు: తామరపువ్వు ఆకారంలో డిజైన్ చేసిన పుష్పక విమానం, దేవేంద్రుడి ఐరావతం, రావణుడిని అడ్డుకునే జటాయువు రాక్షస రూపం విజువల్ వండర్లా నిలిచాయి. అలాగే శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, మంథరగా శీబా చద్దా, లక్ష్మణుడిగా రవీ దూబే ఆకట్టుకున్నారు.
ట్రైలర్ అదిరింది సరి.. కానీ హనుమంతుడేడీ?
ట్రైలర్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్నప్పటికీ, నెటిజన్లలో ఒక చిన్న నిరాశ మిగిలిపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హనుమంతుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు నిమిషాల సుదీర్ఘ ట్రైలర్లో శ్రీరాముడి బాల్యం, సీతారాముల కల్యాణం, వనవాసం, సీతాపహరణం వరకు చూపించినప్పటికీ.. హనుమంతుడికి సంబంధించిన ఒక్క చిన్న గ్లింప్స్ కూడా చూపించలేదు.
దీంతో “ట్రైలర్లో మన హనుమంతుడు ఎక్కడ? కనీసం పోస్టర్ అయినా వదలాల్సింది” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొదటి భాగం ప్రధానంగా సీతాపహరణం చుట్టూ తిరుగుతుందని, హనుమంతుడి ఎంట్రీని సస్పెన్స్‌గా ఉంచి ఆ ఉత్కంఠను పెంచడానికే మేకర్స్ ఇలా ప్లాన్ చేశారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏది ఏమైనా, ప్రపంచ స్థాయిలో భారతీయ ఇతిహాసాన్ని ఆవిష్కరిస్తున్న ‘రామాయణ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది!
