Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దాటికి తెలంగాణ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత 20 గంటలకు పైగా ఉత్తర తెలంగాణ జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ మీదుగా వేగంగా దూసుకొస్తున్న ఈ తుఫాను తీవ్రత కారణంగా రాబోయే 36 గంటల పాటు రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉత్తర తెలంగాణపై తీవ్ర ప్రభావం!
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత అత్యంత ఘోరంగా ఉండేలా కనిపిస్తోంది.
-
ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో గంటల వ్యవధిలోనే కుండపోత వానలు కురిసే ప్రమాదం ఉంది.
-
మోస్తరు నుంచి భారీ వర్షాలు: కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా 30 సెం.మీ నుంచి 45 సెం.మీ వరకు రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కావచ్చని తెలంగాణ వెదర్‌మ్యాన్ భయందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో ముసురు.. జిల్లాల్లో జలదిగ్బంధం!
హైదరాబాద్ నగరం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. రోజంతా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో కూడిన చినుకులు, ముసురు వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.
మరోవైపు, జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదకరంగా మారిన లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో నమోదైన ప్రధాన వర్షపాతం (సెం.మీలలో):
జయశంకర్ భూపాలపల్లి (పలిమెల) – 19.43 సెం.మీ
జగిత్యాల (సారంగపూర్) – 19.40 సెం.మీ
జగిత్యాల (బుగ్గారం) – 18.33 సెం.మీ
వెలగటూర్ – 17.57 సెం.మీ
ఎండపల్లి – 15.38 సెం.మీ
రాయికల్, జగిత్యాల టౌన్ – 14.97 సెం.మీ
పెద్దపల్లి (కమాన్‌పూర్) – 14.14 సెం.మీ
ములుగు (వాజేడు) – 13.36 సెం.మీ
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం మరియు విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చాయి. ఈ వానాకాలంలో మన ప్రాణ రక్షణే మన మొదటి ప్రాధాన్యం.. జాగ్రత్తగా ఉందాం!
