Revanth Reddy: తన 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలానికి, ఇక్కడి ప్రజలకు అత్యంత ప్రత్యేకమైన స్థానముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భావోద్వేగంగా ప్రకటించారు. నాగర్ కర్నూల్ జిల్లా మిడ్జిల్‌లో ఏర్పాటు చేసిన భారీ ‘రాజకీయ కృతజ్ఞత సభ’లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006 జూలై 4న మిడ్జిల్ మండల ప్రజలు తనను స్వతంత్ర అభ్యర్థిగా ఆశీర్వదించి జడ్పీటీసీ (ZPTC) గా గెలిపించారని.. ఆనాడు ఈ ప్రాంత ప్రజలు నాటిన చిన్న రాజకీయ మొక్కే, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పెద్ద వృక్షంగా మారిందని కొనియాడారు. ఆ రోజు తాను పరాయి ప్రాంతం వాడైనప్పటికీ మిడ్జిల్ ప్రజలు గుండెలకు హత్తుకుని సువర్ణాక్షరాలతో ఒక కొత్త చరిత్రను లిఖించారని, అది తన ఒంటరి గెలుపు కాదని, ఇక్కడి ప్రజల నమ్మకానికి దక్కిన విజయమని కృతజ్ఞతలు తెలిపారు.
తనను రాజకీయంగా నిలబెట్టిన మిడ్జిల్ మండలాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మిడ్జిల్ మండలాన్ని ప్రత్యేకంగా దత్తత తీసుకుని, ఇక్కడి మౌలిక వసతులు, సంక్షేమ పనులను నిరంతరం పర్యవేక్షించాలని సభ వేదికగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ రికార్డుల్లో ఇకపై ఇది వెనుకబడిన ‘డార్క్ జోన్’ మండలం కాదని, ఇక్కడి ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు వచ్చాయని నిరూపించేలా నిధులు కేటాయిస్తామన్నారు. తన 20 ఏళ్ల ప్రజా జీవితంలో తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన కొట్లాడానని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నానని చెప్పారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యను, అలాగే వందేళ్ల బీసీల కులగణన డిమాండ్‌ను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాహసోపేతంగా పరిష్కరించిందని గుర్తుచేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరియు కేసీఆర్ అహంకారపూరిత వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పాలమూరు బిడ్డలు కేవలం గుద్దలి, పార పట్టి కూలీ పనులకే పనికొస్తారా, పరిపాలన చేయడానికి అర్హులు కాదా అంటూ నాటి పాలకుల అహంకారాన్ని ఇక్కడి ప్రజలే బొందపెట్టారని మండిపడ్డారు. తనకు పరిపాలన అనుభవం లేదని అవహేళన చేసిన దొరలకు.. గ్రామీణ సమస్యలు, వ్యవసాయంపై ఉన్న అవగాహన గడీల్లో కూర్చునే వారికి ఉండదన్నారు. ప్రజా గాయకుడు గద్దరన్నను ఎర్రటి ఎండలో నాలుగు గంటల పాటు గడీల ముందు నిలబెట్టిన అహంకారాన్ని తెలంగాణ సమాజం క్షమించదని, గద్దర్‌ను అంతగా అవమానించిన కేసీఆర్‌కు ఉరిశిక్ష వేసినా తప్పులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చివరగా కక్షసాధింపు రాజకీయాలు తమకు తెలియవని చెప్తూ.. నాడు 2006లో తనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రబ్బానీకి కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలోనే ఒక ఉన్నతమైన పదవి ఇచ్చి గౌరవిస్తామని, ఆ బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
