Revanth Reddy

Revanth Reddy: ‘మూసీ’కి అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా.. అసెంబ్లీలో తేల్చుకుందాం రండి!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ (BRS) అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ నేతలు నాడు రాజీలేని పోరాటం చేశారని గుర్తుచేశారు. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని కొనియాడారు. ఇదే తరుణంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని పోల్చుతూ కేటీఆర్, హరీష్‌రావులకు సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.

30 నెలల కాంగ్రెస్ పాలన వర్సెస్ బీఆర్ఎస్.. అసెంబ్లీలో చర్చిద్దాం!

గత పాలకుల వైఫల్యాల వల్ల తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. “బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేశారు. ఇప్పుడు అధికారం పోయిన అక్కసుతో కేటీఆర్, హరీష్‌రావు తెలంగాణలో తోడేళ్లలా తిరుగుతున్నారు. కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో.. మా రెండున్నరేళ్ల (30 నెలల) ప్రభుత్వంలో ఏం జరిగిందో అసెంబ్లీలో చర్చకు వస్తారా?” అని సీఎం సవాల్ విసిరారు.

దీనికోసం స్పీకర్‌కు లేఖ రాస్తే తాము అడిగినన్ని రోజులు అసెంబ్లీలో మేనిఫెస్టోలపై చర్చ పెట్టేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఎవరు ఏం చేశారో, పేదలకు ఎవరు న్యాయం చేశారో సభలోనే తేల్చుకుందామని పిలుపునిచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్, పన్నెండేళ్ల బీజేపీ మరియు కాంగ్రెస్ పాలనలపై గ్రామగ్రామాన చర్చ జరగాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.

త్యాగాలంటే మావి.. కాళేశ్వరం కాదు అది ‘కూలేశ్వరం’

రౌండ్-ది-క్లాక్ విమర్శలు చేసే హరీష్‌రావుపై రేవంత్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “నాడు రాజీనామాలు చేయడం, మళ్లీ ఎన్నికలు తెచ్చుకోవడం ఒక త్యాగమా? పెట్రోల్ బాటిల్ తెచ్చుకుని అగ్గిపెట్టె దాచేసే హరీష్‌రావుది ఒక త్యాగమా? అసలైన త్యాగం తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులది” అని స్పష్టం చేశారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు ‘కూలేశ్వరం’ అయిందని ఎద్దేవా చేశారు. నాడు హరీష్‌రావు కాదు.. ‘కాళేశ్వరరావు’ అంటూ ప్రజల కళ్లకు గంతలు కట్టారని, ఇప్పుడు కాళేశ్వరం చుక్క నీరు ఇవ్వకపోయినా కాంగ్రెస్ హయాంలో రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించి చూపించామని వెల్లడించారు. ఎస్ఎల్బీసీ (SLBC) ప్రాజెక్టును పదేళ్లు పడావ్ పెట్టిన దుర్మార్గులు బీఆర్ఎస్ నేతలేనని దుయ్యబట్టారు.

కేసీఆర్ తినే సన్నబియ్యమే.. నేడు పేదలు తింటున్నారు

పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్‌రెడ్డి.. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడిన వారిని తీవ్రంగా విమర్శించారు. నాయకులు, అధికారులు, ఆఖరికి భార్యాభర్తల ఫోన్లు విన్న పాపాలబైరవులను ఏమనాలని ప్రశ్నించారు. వేల కోట్లు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం ఫామ్‌హౌస్‌లు కట్టుకుందని, తాము పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే వారికి కడుపు మంట ఎందుకని అడిగారు.

గతంలో కేసీఆర్ తిన్న సన్నబియ్యమే.. నేడు మా ప్రభుత్వంలో పేద ప్రజలు తింటున్నారు. అనుమానం ఉంటే తండాలకు వెళ్లి చూసుకోవచ్చు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. కేంద్రం చుట్టూ తిరిగి యూరియా కష్టాలు లేకుండా చేశాం. 30 నెలల్లోనే రూ. లక్ష కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేశాం. ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నందుకా ప్రజాపాలన పోవాలని కోరుకుంటున్నారు?” అని రేవంత్ నిలదీశారు. తెలంగాణ గురుకులాల నుంచి వందలాది మంది అంబేద్కర్‌లను తయారు చేయడమే తమ లక్ష్యమని, దళిత, గిరిజనులకు మెరుగైన విద్య అందిస్తున్నామని చెప్పారు.

నా జీవిత లక్ష్యం ‘మూసీ ప్రక్షాళన’.. అడ్డొస్తే తొక్కుతా!

హైదరాబాద్ మూసీ నది ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి అత్యంత కీలకమైన, కఠినమైన వ్యాఖ్యలు చేశారు. “సామాజికంగా బీఆర్ఎస్‌ను ప్రజలు ఎప్పుడో బహిష్కరించారు. బీఆర్ఎస్ అంటే కేవలం గతం మాత్రమే.. దానికి భవిష్యత్తు లేదు. వారి మనస్సుల్లో మూసీ కాలుష్యం కంటే ఎక్కువ విషం నింపుకున్నారు” అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

దేశానికి తలమానికంగా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తానని ఒట్టేసి మరీ చెబుతున్నానని రేవంత్ స్పష్టం చేశారు. “ఇది నా జీవిత లక్ష్యం. మూసీ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపను. ఈ మార్గంలో ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకు పోతాను. భవిష్యత్తులో హైదరాబాద్‌కు ఎవరు వచ్చినా మూసీ అందాలను చూసేలా తీర్చిదిద్దుతాం. 2034 వరకు రాష్ట్రంలో మూడు రంగుల కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది” అని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *