India vs Ireland: ఐర్లాండ్ పర్యటనను టీమ్ ఇండియా ఓటమితో నిరాశాజనకంగా ప్రారంభించింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఐరిష్ జట్టు నిర్దేశించిన 183 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన భారత జట్టు.. కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లందరూ ఘోరంగా విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. అయితే, ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చుట్టూ ఒక విచిత్రమైన డ్రామా నడిచింది.
అభిషేక్ హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్.. ఆ తర్వాత రివర్స్!
భారత ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఐర్లాండ్ బౌలర్ లియామ్ వేసిన బంతికి సింగిల్ తీసి అభిషేక్ శర్మ తన అర్ధశతకాన్ని (50 పరుగులు) పూర్తి చేసుకున్నాడు. దాంతో బ్యాట్ పైకెత్తి అభిషేక్ సంబరాలు చేసుకోగా, పెవిలియన్‌లోని భారత ఆటగాళ్లు, సిబ్బంది సైతం లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు.
కానీ, ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. హాఫ్ సెంచరీ పూర్తయిన మరుసటి బంతికే అభిషేక్ డీప్ మిడ్-వికెట్లో కల్లిస్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ సమయంలో స్కోర్‌బోర్డుపై 20 బంతుల్లో 50 పరుగులు అని స్పష్టంగా కనిపించింది. కానీ, కాసేపటికే సీన్ రివర్స్ అయింది. ఇన్నింగ్స్ 2వ ఓవర్లో అంపైర్ చేసిన ఒక పొరపాటును థర్డ్ అంపైర్ సరిచేయడంతో అభిషేక్ అధికారిక స్కోరు 50 నుండి 49 పరుగులకు పడిపోయింది. దాంతో అర్ధశతకం సాధించినట్లు చేసుకున్న సంబరాలన్నీ వృథా అయ్యాయి.
ఆ ఒక్క పరుగు ఎక్కడ తప్పింది?
ఇన్నింగ్స్ రెండో ఓవర్లో భారత సంతతికి చెందిన ఐరిష్ పేసర్ జయ ముంద్రా వేసిన చివరి బంతిని అభిషేక్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు ఆడి సింగిల్ తీశాడు. అప్పట్లో ఫీల్డ్ అంపైర్ అది బ్యాట్‌కు తగిలి వచ్చిన పరుగుగా భావించి అభిషేక్ ఖాతాలో వేశారు. కానీ ఆ తర్వాత సాంకేతికత ఆధారంగా పరిశీలించగా.. అది బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తగిలి వచ్చిన ‘లెగ్-బై’ పరుగు అని తేలింది. నిబంధనల ప్రకారం లెగ్-బై పరుగులను బ్యాటర్ ఖాతాలో వేయరు కాబట్టి, అభిషేక్ స్కోరు నుండి ఆ ఒక పరుగును తగ్గించారు. ఫలితంగా అతను కేవలం ఒక్క పరుగు దూరంలో (49 పరుగుల వద్ద) అద్భుతమైన హాఫ్ సెంచరీ ఛాన్స్ కోల్పోయాడు.
కలిసిరాని బ్యాటింగ్.. ఐర్లాండ్ సరికొత్త చరిత్ర
183 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌లో టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. పవర్‌ప్లేలోనే ఓపెనర్ సంజు శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), శ్రేయస్ అయ్యర్ (3) వరుసగా పెవిలియన్ చేరారు. అభిషేక్ శర్మ అవుట్ అవ్వడంతో భారత్ పతనం వేగవంతమైంది. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ (19), వాషింగ్టన్ సుందర్ (9) నిరాశపరచగా, శివమ్ దూబే 25 పరుగులు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఐరిష్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశారు.
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే మొట్టమొదటి విజయం కావడం విశేషం. గత 11 మ్యాచ్‌లుగా భారత్‌ను ఓడించలేకపోయిన ఐరిష్ జట్టు, ఎట్టకేలకు ఈ మ్యాచ్ గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో నిలవాలంటే.. ఈరోజే జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఖచ్చితంగా గెలిచి తీరాల్సి ఉంది.
