Raghava Lawrence

Raghava Lawrence: అమ్మ గ్రీన్ సిగ్నల్.. ప్రజల తీర్పే ఫైనల్..

Raghava Lawrence: కోలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన ఒక సంచలన ప్రకటన చేస్తూ.. ఈ నిర్ణయంపై నేరుగా ప్రజలను ఇంకా తన అభిమానుల అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ప్రజలు గనుక ఆమోదిస్తేనే తాను రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని, లేదంటే ఈ ఆలోచనను ఇక్కడితోనే విరమించుకుంటానని లారెన్స్ స్పష్టం చేశారు.

సీటు, డబ్బు కోసం కాదు.. పరిస్థితులే నన్ను మార్చాయి

రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా కలిగిందో వివరిస్తూ లారెన్స్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.. ఫలితం ఆశించకుండా నిజాయతీగా పనిచేయాలనే సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. నిజం చెప్పాలంటే.. రాజకీయాల్లోకి రావాలని నేను ఏనాడూ అనుకోలేదు. నాకు ఎలాంటి సీటు కావాలని లేదు, రాజకీయం ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన అసలే లేదు. నా సన్నిహితులు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే, వారి పక్కన నిలబడి సమాజానికి మరింత సేవ చేయాలనుకున్నా. కానీ, ఇటీవలి కొన్ని పరిస్థితులు, సంఘటనలు నన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనేలా ఆలోచింపజేశాయి అని రాఘవ లారెన్స్ వివరించారు.

అమ్మ గ్రీన్ సిగ్నల్.. ప్రజల తీర్పే ఫైనల్..

పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే రాఘవ లారెన్స్ ఒక వీడియో సందేశాన్ని కూడా పంచుకున్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్తానని చెబితే తన తల్లి పూర్తి మనసుతో అంగీకరించారని అందులో తెలిపారు.

నా జీవిత ప్రయాణంలో ఎదురైన కొన్ని సంఘటనల నుంచే నేను రాజకీయాలపై స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే, నా నిర్ణయం సరైందో కాదో చెప్పాల్సింది ప్రజలైన మీరే. మీరు అంగీకరిస్తే, మీ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వస్తాను. ఎప్పుడు ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తానో.. ఏ పార్టీలో చేరుతానో సరైన సమయం చూసుకుని ప్రకటిస్తాను. ఒకవేళ మీరు వద్దంటే ఈ ఆలోచన ఇప్పుడే మానుకుని.. ఎప్పటిలాగే నా ట్రస్ట్ ద్వారా సమాజం కోసం నిస్వార్థంగా నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను” అని లారెన్స్ పేర్కొన్నారు.

తిరుచ్చి ఈస్ట్‌ ఉప ఎన్నిక.. విజయ్ ‘TVK’ లో చేరబోతున్నారా?

గత కొంతకాలంగా లారెన్స్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండగా.. తాజా రాజకీయ పరిణామాలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఈ ఏడాది (2026) జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత, దళపతి విజయ్ (Vijay) రెండు స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితాల అనంతరం ఆయన పెరంబూర్‌ ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకుని, తాను గెలిచిన ‘తిరుచ్చి ఈస్ట్’ (Trichy East) నియోజకవర్గ స్థానాన్ని వదులుకున్నారు.

విజయ్ రాజీనామాతో తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే రాఘవ లారెన్స్ ఆ స్థానం నుంచే పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

హీరో విజయ్‌తో లారెన్స్‌కు దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే లారెన్స్ ‘టీవీకే’ (TVK) పార్టీలో చేరి, విజయ్ వదిలేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానం నుండి ఉప ఎన్నికల బరిలో నిలుస్తారనే అభిప్రాయాలు కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఆధారంగా లారెన్స్ తన తదుపరి పొలిటికల్ స్టెప్ వేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *