Crime News: 

Crime News: బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక నటి ఆత్మహత్య.. 10 రోజులైనా స్పందించని పోలీసులు?

Crime News: వెండితెరపై నటిగా రాణించాలనే ఎన్నో ఆశలతో, ఆశయాలతో హైదరాబాద్ మహానగరంలో అడుగుపెట్టిన ఓ యువతి చివరకు కామాంధుల వేధింపులకు బలై శవమై తేలింది. నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ.. కొంతమంది దుండగుల బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిన అత్యంత విచారకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘోరం జరిగి 10 రోజులు గడుస్తున్నా.. నిందితులపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర అగ్రహాన్ని, కలకలాన్ని రేపుతున్నాయి.

రహస్య వీడియోలతో 6 నెలలుగా నరకయాతన:

మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొంతమంది స్థానిక కామాంధులు అమూల్య శ్రీని టార్గెట్ చేశారు. ఆమె నివాసముంటున్న ప్రాంతంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత బాత్‌రూమ్ వీడియోలను సదరు యువకులు రహస్యంగా రికార్డ్ చేశారు.

ఆ రహస్య వీడియోలను చూపించి గత 6 నెలలుగా ఆ దుండగులు అమూల్య శ్రీని తీవ్ర మానసిక నరకయాతనకు గురిచేశారు.  తమ కామ కోరికను తీర్చడానికి తమ దగ్గరికి రావాలని, లేదంటే ఆ వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి, సినిమా ఇండస్ట్రీలో ఆమె కెరీర్‌ను పూర్తిగా నాశనం చేస్తామంటూ నిందితులు నిరంతరం బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధించారు.

పోలీసులను ఆశ్రయించినా దక్కని న్యాయం – పెరిగిన నిర్లక్ష్యం:

కామాంధుల వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో, ఈ నరకం నుంచి తనను కాపాడి న్యాయం చేయాలంటూ అమూల్య శ్రీ ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందే స్థానిక పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. అమాయక యువతి ప్రాణాల మీదికి వచ్చి ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో స్పందించలేదు. నిందితుల వెనుక ఉన్న ప్రభావవంతమైన వ్యక్తుల వలనో ఏమో కానీ.. వారిపై తగిన చర్యలు తీసుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారు.

రక్షణ కల్పించాల్సిన పోలీసుల నుండి కూడా ఎలాంటి మద్దతు లభించకపోవడంతో, ఆ కామాంధుల చేతిలో తన పరువు బజారున పడుతుందేమోననే తీవ్ర భయాందోళనకు, మనస్తాపానికి గురైన అమూల్య.. 10 రోజుల క్రితమే తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఒంటరిగా తల్లి పోరాటం – నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్.

అమూల్యకు తండ్రి లేకపోవడంతో ఆ కుటుంబానికి ఆమే దిక్కయింది. ఇప్పుడు కూతురు కూడా అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. నిందితుల ఆగడాలు, పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని, తనకు న్యాయం చేయాలంటూ ఆమె ఒంటరిగా పోరాడుతోంది. తన బిడ్డ ప్రాణాలు తీసిన ఆ కామాంధులను వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని సదరు తల్లి కన్నీరుమున్నీరవుతూ ప్రభుత్వాన్ని మరియు ఉన్నతాధికారులను వేడుకుంటోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ ‘జస్టిస్ ఫర్ అమూల్య శ్రీ’ అంటూ నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *