TRS

TRS: టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ సెంటిమెంట్..!

TRS: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పార్టీల ఏర్పాటు మరియు పేర్ల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. కవిత నేతృత్వంలో ప్రతిపాదిత రాజకీయ పార్టీ అయిన ‘తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్‌)’ పేరుపై ప్రధాన ప్రతిపక్షం భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పేరును సదరు కొత్త పార్టీకి కేటాయించవద్దని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) అధికారికంగా ఫిర్యాదు చేసింది.

“టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ సెంటిమెంట్” – బీఆర్‌ఎస్ వాదన.

కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఫిర్యాదులో బీఆర్‌ఎస్ కీలక అంశాలను ప్రస్తావించింది. ‘టీఆర్‌ఎస్‌’ (తెలంగాణ రాష్ట్ర సమితి) అనే పేరు తెలంగాణ రాష్ట్ర సాధనతోను, ఇక్కడి ప్రజల సుదీర్ఘ సెంటిమెంట్‌తోను బలంగా ముడిపడి ఉందని బీఆర్‌ఎస్ పేర్కొంది. తాము జాతీయ రాజకీయాల కోసం ‘బీఆర్‌ఎస్’గా పేరు మార్చుకున్నప్పటికీ, రాష్ట్రంలో ఇప్పటికీ మెజారిటీ ప్రజలు తమ పార్టీని ‘టీఆర్‌ఎస్‌’గానే గుర్తిస్తారని ఇంకా భావిస్తారని స్పష్టం చేసింది. ఇలాంటి తరుణంలో అదే సంక్షిప్త నామం (Abbreviation) వచ్చేలా ‘తెలంగాణ రక్షణసేన’కు టీఆర్‌ఎస్‌ అనే పేరు కేటాయిస్తే ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఆ పేరును మరెవరికీ కేటాయించవద్దని ఈసీఐని గట్టిగా విజ్ఞప్తి చేసింది.

వరదలా వచ్చిన అభ్యంతరాలు – ఈసీఐ పరిధిలో 700 ఫిర్యాదులు:

కవిత ప్రతిపాదించిన ఈ కొత్త పార్టీ పేరుపై కేవలం బీఆర్‌ఎస్ మాత్రమే కాకుండా, పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్‌) పేరును వ్యతిరేకిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటివరకు దాదాపు 700 అభ్యంతరాలు అందడం గమనార్హం. గతంలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా.. ఈ పేరుపై ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా చెప్పుకోవచ్చని ఈసీఐ సూచించిన సంగతి తెలిసిందే. ఈ గడువులోనే భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చి చేరాయి.

ఒకప్పుడు తెలంగాణను శాసించిన ‘టీఆర్‌ఎస్’ అనే పాత పేరును పోలినట్లుగా కొత్త పార్టీ పేరు ఉండటంతో ఈ వివాదం ముదిరింది. ఈసీఐ నిబంధనల ప్రకారం ఒక గుర్తింపు పొందిన పార్టీ పేరును లేదా ప్రజాదరణ పొందిన పాత పేరును పోలి ఉండి, ఓటర్లను తప్పుదారి పట్టించేలా ఉంటే ఆ పేర్ల కేటాయింపుపై ఈసీఐ పునరాలోచన చేస్తుంది. మరి ఈ 700 అభ్యంతరాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కవిత పార్టీ పేరుపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *