TGIIC Auction: తెలంగాణను ‘త్రీ ట్రిలియన్ డాలర్’ ఎకానమీగా మార్చాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) తాజాగా నిర్వహించిన భూముల వేలం ప్రక్రియలో పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఐటీ హబ్ నడిబొడ్డున ఉన్న రాయదుర్గం మక్తా ఏరియాలో కేవలం ఒక్క ఎకరం భూమి ధర ఏకంగా రూ. 237 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రభుత్వం ఈ భూమికి నిర్ణయించిన కనీస ధర (రిజర్వ్ ప్రైస్) రూ. 139 కోట్లు కాగా.. అంతకంటే 70.5 శాతం అదనపు రేటును వెచ్చించి ప్రముఖ సంస్థ ‘గౌర వెంచర్స్’ (Gaura Ventures) ఈ ల్యాండ్‌ను దక్కించుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దక్షణాది చిత్రపటంలోనే ఒక ఎకరం భూమికి ఈ స్థాయి ధర పలకడం ఇదే తొలిసారి.
ఈ-ఆక్షన్‌లో సరికొత్త బెంచ్ మార్క్.. ఖజానాకు కాసుల వర్షం!
రాయదుర్గం మక్తా పరిధిలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న 6.29 ఎకరాల స్థలానికి TGIIC ఈ వేలం నిర్వహించింది. MSTC ప్లాట్‌ఫామ్ ద్వారా పారదర్శకంగా సాగిన ఈ ‘ఈ-ఆక్షన్’ (e-Auction) రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ప్లాట్ నెంబర్ 1A & 1/F గా ఉన్న ఈ భారీ ల్యాండ్ బిడ్డింగ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ. 1,490 కోట్లకు పైగా భారీ ఆదాయం సమకూరింది.
ఈ స్థలంలో సదరు సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐటీ టవర్స్‌ను (IT Towers) నిర్మించే యోచనలో ఉన్నట్లు సమాచారం. గ్లోబల్ ఇన్వెస్టర్లు హైదరాబాద్ నగరాన్ని ఒక సేఫెస్ట్ అండ్ బెస్ట్ గ్రోత్ కారిడార్‌గా చూస్తున్నారనడానికి ఈ రికార్డు ధరలే నిదర్శనమని TGIIC ఉన్నతాధికారులు సగర్వంగా పేర్కొంటున్నారు.
గతేడాది రికార్డు బద్దలు.. జూన్ 1న మరో హాట్ కేక్!
గతేడాది సైతం ఇదే రాయదుర్గం ప్రాంతంలో TGIIC వేలం పాట నిర్వహించినప్పుడు ఎకరాకు రూ. 177 కోట్లు పలికింది. అప్పట్లో అదే ఆల్ టైమ్ రికార్డ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా రూ. 237 కోట్లు పలకడంతో హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ, కోకాపేట లాంటి ప్రాంతాల పేర్లు ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో మారుమోగుతున్నాయి. ఇక్కడ పెట్టే పెట్టుబడులకు తిరుగులేని రిటర్న్స్ వస్తాయనే నమ్మకం ఇన్వెస్టర్లలో బలంగా నాటుకుపోయింది.
కాగా, ఇదే జోష్‌తో జూన్ 1వ తేదీన ఇదే ఏరియాలో ఉన్న మరో 5.09 ఎకరాల స్థలాన్ని వేలం వేసేందుకు TGIIC అధికారులు సర్వం సిద్ధం చేశారు. తాజా రికార్డుల నేపథ్యంలో రాబోయే వేలంలో ఇంకెన్ని అద్భుతాలు నమోదు కానున్నాయోనని రియల్ ఎస్టేట్ రంగం ఆసక్తిగా గమనిస్తోంది.
