TGSRTC: ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఛార్జీలను పెంచబోతోందంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. డీజిల్ ధరలు పెరగడంతో సంస్థపై అదనపు భారం పడుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ, ప్రస్తుతానికి బస్సు టికెట్ ధరలను పెంచే ఆలోచన ఏదీ లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం నిత్యం బస్సుల్లో ప్రయాణించే సామాన్య ప్రజలకు పెద్ద ఊరట కలిగించే విషయమనే చెప్పాలి.
గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఇప్పటికే లీటర్‌పై దాదాపు రూ. 7 వరకు పెరగ్గా, మున్ముందు ఈ పెంపు రూ. 10 కి చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చమురు కంపెనీలు నష్టాల నుండి బయటపడాలంటే ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే ఆర్టీసీ కూడా బస్సు ఛార్జీలను పెంచుతుందని ప్రచారం సాగింది. అయితే, ప్రస్తుతానికి పాత ఛార్జీలే వర్తిస్తాయని, పెంపు ప్రతిపాదనలు ఏవీ లేవని ఎండీ క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇంధన ధరలు స్థిరపడిన తర్వాతే, అప్పటి పరిస్థితులను బట్టి ఛార్జీల సవరణపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఆర్టీసీ సంస్థపై భారీగానే ఆర్థిక భారం పడుతోంది. లెక్కల ప్రకారం.. లీటర్ డీజిల్‌పై కేవలం ఒక్క రూపాయి పెరిగినా ఆర్టీసీకి నెలకు రూ. 1 కోటి 28 లక్షల అదనపు భారం పడుతుంది. ఇప్పుడు లీటరుకు రూ. 6 చొప్పున పెరగడంతో, సంస్థపై ప్రతి నెలా దాదాపు రూ. 7.68 కోట్ల మేర భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 10 వేల బస్సులు తిరుగుతుండగా, వీటికి రోజుకు 6 లక్షల లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. అంటే నెలకు దాదాపు 1.80 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగించాల్సి వస్తోంది. దీనివల్ల సంస్థకు రోజుకు రూ. 36 లక్షల అదనపు నష్టం వస్తోంది.
ఒకవేళ రాబోయే రోజుల్లో బస్సుల్లో రద్దీ పెరిగి, డీజిల్ వినియోగం మరింత ఎక్కువైతే ఈ అదనపు భారం నెలకు రూ. 10 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. తాము కూడా బస్సు ఛార్జీలను పెంచి ప్రజలపై మరో భారం వేయకూడదనే ఉద్దేశంతో టీజీఎస్ఆర్టీసీ ఉంది. అందుకే ప్రస్తుతానికి ఈ కోట్ల రూపాయల నష్టాన్ని సంస్థే భరిస్తూ ప్రయాణికులకు ఊరటనిచ్చింది.
