Mango Storage Tips: వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది రారాజు లాంటి మామిడి పండే. తీపి, పులుపు రుచులతో ఉండే మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అయితే, మార్కెట్ నుండి తెచ్చిన మామిడి పండ్లు త్వరగా పాడైపోకుండా, ఎక్కువ రోజులు తాజాగా ఎలా ఉంచాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొందరైతే తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్లో పెట్టేస్తుంటారు. కానీ, అలా చేయడం వల్ల మామిడి పండ్లు వాటి అసలైన రుచిని, సువాసనను కోల్పోతాయి. మరి మామిడి పండ్లను ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా దాచుకోవాలో కొన్ని సులువైన చిట్కాల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి మామిడి కాయలను ఫ్రిజ్లో పెట్టకూడదు!
మార్కెట్ నుండి మీరు తెచ్చిన మామిడి కాయలు ఇంకా పూర్తిగా పండకుండా గట్టిగా ఉంటే.. వాటిని అస్సలు ఫ్రిజ్లో పెట్టకండి. ఫ్రిజ్లో ఉండే చల్లదనం వల్ల కాయలు పండే ప్రక్రియ ఆగిపోతుంది. దీనివల్ల అవి లోపల గట్టిగా ఉండిపోయి, కాలక్రమేణా కుళ్ళిపోతాయి తప్ప అస్సలు పండవు. పైగా వాటిలో ఉండే సహజమైన తీపి కూడా తగ్గిపోతుంది. అందుకే పచ్చిగా ఉన్న కాయలను ఎప్పుడూ బయట గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి.
పచ్చి కాయలు త్వరగా పండాలంటే ఏం చేయాలి?
పచ్చి మామిడి కాయలు త్వరగా, సహజంగా పండటానికి ఒక మంచి ఉపాయం ఉంది. వాటిని ఒక పేపర్ బ్యాగ్లో గానీ లేదా న్యూస్ పేపర్లో గానీ చుట్టి విడిగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల మామిడి కాయల నుండి ‘ఇథిలీన్’ అనే గ్యాస్ విడుదలై, ఆ వేడికి పండ్లు త్వరగా, సమానంగా పండుతాయి. ఒకవేళ మీ దగ్గర పేపర్ బ్యాగ్ లేకపోతే.. ఇంట్లో బియ్యం ఉన్న డబ్బాలో మామిడి కాయలను ఉంచినా కూడా రెండు రోజుల్లోనే చక్కగా పండుతాయి.
బాగా పండిన పండ్లను ఫ్రిజ్లో ఎలా పెట్టాలి?
మామిడి పండ్లు పూర్తిగా పండి, మంచి సువాసన వస్తున్నప్పుడు వాటిని ఫ్రిజ్లో పెట్టవచ్చు. అయితే, వాటిని నేరుగా ఫ్రిజ్ అరల్లో పెట్టకుండా.. ఒక ప్లాస్టిక్ కవర్ లేదా జిప్ లాక్ బ్యాగ్లో పెట్టి, ఫ్రిజ్లో కింద ఉండే వెజిటబుల్ బాక్స్ లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్ లోని చల్లటి గాలి నేరుగా పండ్లకు తగలకుండా ఉంటుంది. దీనివల్ల పండ్ల పై చర్మం నల్లగా మారకుండా తాజాగా ఉంటుంది. పండిన పండ్లను ఫ్రిజ్లో 4 నుంచి 5 రోజుల పాటు చక్కగా దాచుకోవచ్చు.
కట్ చేసిన మామిడి ముక్కల నిల్వ ఇలా..
చాలా మంది మామిడి పండ్లను ముక్కలుగా కోసి, మిగిలిపోయిన వాటిని అలాగే ఫ్రిజ్లో పెట్టేస్తుంటారు. అలా కాకుండా, కట్ చేసిన ముక్కలను ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచి ఫ్రిజ్లో పెట్టాలి. ఇలా చేస్తే ముక్కలు ఎండిపోకుండా ఉంటాయి, అలాగే ఫ్రిజ్లోని ఇతర వస్తువుల వాసన వీటికి అంటుకోదు. ఈ ముక్కలను ఒకటి లేదా రెండు రోజుల్లో తినేయడం మంచిది.
స్పెషల్ టిప్: ఒకవేళ మీరు మామిడి ముక్కలను కొన్ని నెలల పాటు దాచుకోవాలనుకుంటే.. వాటిని డీప్ ఫ్రిజ్ లో పెట్టి ఐస్ లా మార్చవచ్చు. వీటిని తర్వాత మాంగో షేక్స్ లేదా స్మూతీలు చేసుకోవడానికి వాడుకోవచ్చు.
మామిడి పండ్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి:
* ముందే కడగవద్దు: మార్కెట్ నుంచి తెచ్చిన మామిడి పండ్లను తినడానికి ముందే కడగాలి. నిల్వ చేసే ముందే కడిగి, తడి ఆరకుండా అలాగే పెడితే ఆ తేమ వల్ల పండ్లపై బూజు పట్టి త్వరగా కుళ్ళిపోతాయి.
* ఇతర పండ్ల పక్కన పెట్టవద్దు: మామిడి పండ్లను అరటిపండ్లు లేదా ఆపిల్ పండ్ల పక్కన కలిపి ఉంచకూడదు. ఎందుకంటే ఆ పండ్ల నుంచి వచ్చే గ్యాస్ వల్ల మామిడి పండ్లు అతి త్వరగా పండిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది.
ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లోని మామిడి పండ్లు ఎక్కువ రోజులు తాజాగా, తియ్యగా ఉంటాయి!
