Nara Lokesh

Nara Lokesh: 16 వేల మంది టీచర్లను అవమానిస్తావా?.. లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పు!

Nara Lokesh: ఏపీలో ‘మెగా డీఎస్సీ’ (Mega DSC) ఫలితాలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియపై అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. మెగా డీఎస్సీనా, దగా డీఎస్సీనా అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. జగన్ సంధించిన ప్రశ్నలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూనే.. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల వైఫల్యాలను ఎండగట్టారు.

ఐదేళ్లలో ఒక్క పోస్టైనా భర్తీ చేశావా?

గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను దగా చేసింది జగన్ మాత్రమేనని నారా లోకేష్ విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, నిరుద్యోగులకు ఊరించిన ‘జాబ్ క్యాలెండర్’ ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఏకంగా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసి మెగా డీఎస్సీని విజయవంతం చేశామని గుర్తుచేశారు. దీనికి తోడు మరో 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చామన్నారు. త్వరలోనే రాష్ట్రంలో మరో డీఎస్సీని కూడా నోటిఫై చేయబోతున్నామని.. ఈసారి మరింత గట్టిగా ఏడవడానికి జగన్ సిద్ధంగా ఉండాలంటూ లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు క్షమాపణ చెప్పాలి! మెగా డీఎస్సీ పారదర్శకతను అనుమానించడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ను ఉద్దేశించి మంత్రి లోకేష్ చేసిన ‘ఎక్స్’ పోస్ట్:

మీరు టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని.. లోకంలో అందరూ అలాగే ఉంటారని అనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో.. నిద్రాహారాలు మాని, రాత్రింబగళ్లు చదివి, తమ సొంత ప్రతిభతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఆ 16 వేల మంది నిరుద్యోగులను మీరు అనుమానిస్తున్నారు, ఘోరంగా అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ గారు లెంపలు వేసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి.

రాష్ట్ర యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారు..

కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే, జగన్ మాత్రం కుట్రలతో అడ్డుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు. మెగా డీఎస్సీని ఎలాగైనా ఆపాలని ఏకంగా 200 కేసులు వేయించారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా, రాష్ట్రానికి గూగుల్ (Google), టీసీఎస్ (TCS) లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు రాకుండా కోర్టుల్లో కేసులు వేయించారని దుయ్యబట్టారు.

రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటూ.. యువతకు ఉపాధి లేకుండా వారి భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్న జగన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ క్షమించరని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *