Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో సోమవారం రాత్రి నిర్వహించిన పార్టీ నాయకుల అంతర్గత సమావేశంలో అత్యంత పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే, క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా ఊపేక్షించేది లేదని కరాఖండిగా తేల్చిచెప్పారు. “ఇక నుంచి నేనే కమాండర్‌ను.. నా మాట వినాల్సిందే!” అంటూ పార్టీ పగ్గాలను పూర్తిస్థాయిలో తన చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
5 కోట్ల మంది ప్రజల కోసం కూటమి.. చిన్న విషయాలకు గొడవలా?
రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసమే తాము కూటమి కట్టామని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.
మనసా వాచా కర్మణా మద్దతు: ప్రజలు కూటమిని నమ్మి ఓటేశారని, అలాంటప్పుడు కూటమిలోని చిన్న చిన్న సమస్యలకే గొడవ పడతామా అని ప్రశ్నించారు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం తాను కూటమికి మనసా, వాచా, కర్మణా మద్దతిస్తానని స్పష్టం చేశారు.
చప్పబడిపోతే కుదరదు: ప్రస్తుతం జనసేన నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తారస్థాయిలో ఏమీ లేవన్నారు. “వేల మంది జనసేన నాయకులకు పదవులు రాగానే ఇలా చప్పబడిపోయారేంటి? చప్పబడిపోయిన వాళ్లెవరూ జనసేనకు అక్కర్లేదు. నాకు ఇంకా పౌరుషం, కొట్లాడే గుణం పోలేదు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య ఆత్మగౌరవం కోసం పోరాడిన ఆ తెగువ మళ్లీ రావాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలంగా సిద్ధం చేయాలని ఆదేశించారు.
తమిళనాడు రాజకీయాలు చూస్తే అసూయగా ఉంది..
తమిళనాడు రాజకీయాలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ కాస్త సరదాగా, మరికొంత ఆవేదనగా మాట్లాడారు. “తమిళనాడులో ఎంత సుఖంగా రాజకీయాలు చేశారు! కటౌట్లు, హోలోగ్రామ్‌లు పెట్టి ముఖ్యమంత్రి అయిపోయారు. అది చూస్తే నాకు అసూయ కలిగింది. నన్ను మాత్రం 15 ఏళ్లు రోడ్లపై నడిపించారు (నవ్వుతూ..). తమిళులంతా ఒకే మాటపై ఉంటారు, కానీ ఇక్కడ ఆంధ్రావాళ్లకు ఆంధ్రావాళ్లతోనే కుదరదు” అని వ్యాఖ్యానించారు. తనకున్న స్టార్‌డమ్ వదిలి జనం కష్టాలు తీర్చడానికే రాజకీయాల్లోకి వచ్చానని, వారి సమస్య తీరితే తనకు ఆస్కార్ వచ్చినంత ఆనందం కలుగుతుందన్నారు.
పార్టీ వ్యూహం నాకు వదిలేయండి.. ఆగస్టు 14 నాటికి కమిటీలు!
పార్టీ అంతర్గత వ్యవహారాలపై పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. “ఇప్పటి నుంచి పార్టీ కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది. వ్యూహం నాకు వదిలేయండి, నేను చెప్పింది పక్కాగా ఆచరించండి. ఎవరికైనా ఏకాభిప్రాయానికి ఇబ్బంది ఉంటే పార్టీలో నుంచి వెళ్లిపోవచ్చు. క్రమశిక్షణ తప్పితే నేనే స్వయంగా పార్టీ నుంచి తప్పిస్తా” అని తేల్చిచెప్పారు.
ప్రకాశం జిల్లా కమిటీలో గ్రూపు గొడవల వల్లే దాన్ని సస్పెండ్ చేశానని వెల్లడించారు. జూన్ మొదటి వారంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలకు కమిటీలను పంపుతున్నామని, మూడు పద్ధతుల్లో అభిప్రాయాలు సేకరించి తానే స్వయంగా కమిటీల నియామకం పూర్తి చేస్తానని, ఆగస్టు 14 నాటికి జనసేన పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటు పూర్తవుతుందని ప్రకటించారు. నాదెండ్ల మనోహర్‌నే మళ్లీ నాయకుడిగా పెడుతున్నానని, అందరూ ఆయనను అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇకపై భరించేది లేదు.. ఎదురుదాడి చేస్తాం!
ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్‌ను కేవలం తమ ఎదుగుదలకు వాడుకున్నా తాను సహనంతో భరించానని, కానీ ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. దారినబోయే వారెవరో జనసేనపై రాళ్లు వేస్తామంటే చూస్తూ ఊరుకోనని, కొన్ని టీవీ ఛానళ్లు ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తే ఇకపై ‘ఎదురుదాడి’ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. సొంత పార్టీ నాయకులే పౌరసరఫరాల బియ్యం విషయంలో లోపల జరిగిన విషయాలను టీవీలకు లీక్ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు కౌంటర్.. అమిత్ షాతో ఆ ముచ్చట్లేనా?
వైసీపీ నాయకుడిని (జగన్‌ను) జైల్లో వేయాలని తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అడిగినట్లు ఒక విశ్లేషకుడు (ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఉద్దేశించి) చెప్తున్న మాటలపై పవన్ తీవ్రంగా మండిపడ్డారు.
నేరం చేసినవాణ్ని జైలుకు పంపాలని నేను చెప్పాలా? అందుకు వ్యవస్థలు, ఏసీబీ కోర్టులు లేవా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మేం చెప్పాలా? ఇలాంటి మాటలు నన్నో, అమిత్‌షానో కాదు.. దేశ వ్యవస్థలనే అవమానించడం. ఒకరు జైలుకెళ్తే పవన్ కళ్యాణ్ ఎదుగుతాడా? అలాంటి మైండ్‌సెట్ ఉన్నవాణ్నే అయితే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడే దాన్ని సరైన సమయంగా వాడుకునేవాడిని కదా! కానీ అది నా నీతి కాదు. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు కొట్టను.. బలంగా ఉన్నప్పుడే కొడతా. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే తుపాకీ సరెండర్ చేసి పాలిటిక్స్‌లోకి వచ్చా, ఆయన రెండోసారి సీఎం అయినా అదే ధైర్యంతో బలంగా నిలబడ్డా.” – జనసేనాని పవన్ కళ్యాణ్
అమిత్ షాతో మాట్లాడటానికి దేశ భవిష్యత్తు, ఏపీ అభివృద్ధి తప్ప ఇంకేం విషయాలు లేవా అని ప్రశ్నించిన పవన్.. అమిత్ షాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
