Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫైర్.. అమిత్ షాతో భేటీపై విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులకు, విమర్శకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్స్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు అన్నీ ఓపికగా భరించానని, కానీ ఇకపై భరించే ఓపిక తనకు లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఎవరినో అరెస్ట్ చేయించడానికి తాను రాజకీయం చేయడం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ (YCP) నాయకుడు జైలుకు వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని, ఒకరు జైలుకు వెళ్తేనే జనసేన ఎదుగుతుందా? అని ఆయన గట్టిగా నిలదీశారు. దేశ హోంమంత్రి అమిత్ షాతో తాను ఇలాంటి విషయాలు మాట్లాడుతానా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను కేంద్రమంత్రి అమిత్ షాను కలిశానని చెప్పారు. తాము మాట్లాడుకున్న విషయాలు బయట వాళ్లకు ఎలా తెలుస్తాయని, ఈ వివాదంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.

దారినపోయే వాళ్లంతా జనసేనపై రాళ్లు వేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. విమర్శలు చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుందని, వేరే వాళ్లు ఎదగడం కోసం తన్ను వాడుకోవాలని చూస్తే సహించనని అన్నారు. “ఇకపై భరించడాలు లేవు, అన్నింటికీ పర్యవసానాలు ఉంటాయి. భరిస్తాం, సహిస్తాం.. అవసరమైతే తాటతీస్తాం” అంటూ పవన్ కళ్యాణ్ తన శైలిలో తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తే అంతే స్థాయిలో సమాధానం ఇస్తానని చెప్పారు.

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ నేతలకు కూడా గట్టిగా క్లాస్ పీకారు. శత్రువులు ఎక్కడో లేరని, మన పార్టీలోనే ఉంటూ అనేక విషయాలను బయటకు లీక్ చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో కట్టుబాట్లకు లోబడి ఉండగలిగే వాళ్లే ఉండాలని స్పష్టం చేశారు. పదవులు రాగానే చాలామంది నేతలు మెత్తబడిపోయారని, అలాంటి నాయకులు జనసేనకు అవసరం లేదన్నారు. తన ఆదేశాలు పాటించని వారు పార్టీ నుంచి తప్పుకోవచ్చని అల్టిమేటం జారీ చేశారు. తాను తెలుగుదేశం పార్టీ (TDP) కోసం కాదు, కేవలం రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే సర్దుకుపోతున్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

తనపై కులం ముద్ర వేయాలని చూస్తున్న వారిపై కూడా పవన్ మండిపడ్డారు. తాను ఎప్పుడూ ఒక కులానికి నాయకుడినని చెప్పుకోలేదని, కులాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. సమాజంలో కులాలన్నింటినీ రెచ్చగొట్టే మనస్తత్వం మంచిది కాదన్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజకీయాలను ప్రస్తావిస్తూ.. అక్కడ కేవలం కటౌట్లు, హలోగ్రామ్స్ పెట్టుకుని ఈజీగా గెలిచి సీఎంలు అయిపోయారని, కానీ ఏపీలో తనను మాత్రం 12 ఏళ్లు రోడ్ల మీద తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రాజకీయ పార్టీని నడపడం, ఈ స్థాయికి రావడం అంత సులువు కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *