Bengaluru Mahanagaram Lo Balaka

Bengaluru Mahanagaram Lo Balaka: ప్రియదర్శి చేతుల మీదుగా ‘బెంగళూరు మహానగరంలో బాలక’ ఫస్ట్ లుక్ అవుట్

Bengaluru Mahanagaram Lo Balaka: మంత్ర మూవీ మేకర్స్, ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మహి – రాజ్ ద్వయం సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం ‘బెంగళూరు మహానగరంలో బాలక’. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు ప్రియదర్శి తాజాగా విడుదల చేశారు. బెంగళూరు సిటీ బ్యాక్‌డ్రాప్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమా కథ అంతా మన తెలుగు కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. బతుకుదెరువు కోసం బెంగళూరు లాంటి మహానగరానికి వెళ్లిన ఒక తెలుగు యువకుడు అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఎలాంటి విచిత్రమైన సమస్యలను ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా బాగా ఎంజాయ్ చేసేలా, ప్రతి సన్నివేశాన్ని ఫుల్ కామెడీతో ఎంతో వినోదభరితంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. బెంగళూరుతో పాటు తెలంగాణలోని వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు సంబంధించిన కీలక సీన్లను షూట్ చేశారు.

ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ ముఖ్య పాత్రలో నటిస్తూ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తూ టాలీవుడ్ ప్రముఖ కామెడీ నటుడు రఘు కారుమంచి ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తుండగా.. ‘చిత్రం’ శ్రీను కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లు, నటులు ధనరాజ్ వినీత్, మహేంద్ర, అచ్యుత్ కూడా ఈ చిత్రంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా, విశ్వదీప్ మ్యూజిక్ అందిస్తున్నారు. హర్షిత్ కొటా ఈ చిత్రానికి ఎడిటర్‌గా బాధ్యతలు చూస్తున్నారు. నవ్వులు పూయించే నటీనటులు, సరికొత్త కథతో వస్తున్న ‘బెంగళూరు మహానగరంలో బాలక’ చిత్రం త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *