Hyderabad

Hyderabad: కొత్త కారుతో ORRపై 200 కి.మీ వేగం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!

Hyderabad: కొత్త కారు కొన్నాననే ఆనందంలో ఓ యువకుడు చేసిన నిర్వాకం అతన్ని చిక్కుల్లో పడేసింది. కారు ఎంత వేగంగా వెళ్తుందో పరీక్షించాలనుకున్నాడు. అంతే, నిబంధనలకు విరుద్ధంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై కారును బుల్లెట్‌లా పరిగెత్తించాడు. అంతటితో ఆగకుండా ఆ వేగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. చివరకు ఆ వీడియోనే అతన్ని జైలు పాలు చేసింది. వైరల్ వీడియో ఆధారంగా రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి, కొత్త కారును సీజ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మణికొండలోని అల్కాపూర్ కాలనీకి చెందిన కొత్తపల్లి యశ్వంత్‌రెడ్డి అనే యువకుడు ఇటీవలే ఒక కొత్త కారును కొనుగోలు చేశాడు. ఆ కారు ఇంజన్ పవర్ ఎలా ఉందో, ఎంత స్పీడ్ అందుకుంటుందో టెస్ట్ చేయాలనుకున్నాడు. అందుకోసం ఈ నెల 10న కారును తీసుకుని ఓఆర్ఆర్‌పైకి ఎక్కాడు. నార్సింగి నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ మధ్యలో కారు స్పీడోమీటర్‌ను వంద నుంచి ఏకంగా 200 కిలోమీటర్లకు పెంచేసి అత్యంత ప్రమాదకరంగా డ్రైవ్ చేశాడు.

నిజానికి ఓఆర్ఆర్‌పై వాహనాలు వెళ్లడానికి గరిష్ట స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్లు మాత్రమే ఉంది. కానీ, యశ్వంత్ రెడ్డి మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తూ 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాడు. ఆ సమయంలో పక్కన వెళ్తున్న మిగతా వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత తన కారు స్పీడ్ వీడియోను ‘ఇదిగో నా కొత్త కారు పవర్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియో కాస్తా ఓఆర్ఆర్ పెట్రోలింగ్ అధికారి సాయిరాం దృష్టికి వెళ్లింది. అంత వేగంతో కారు నడపడం వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన ఆయన, వెంటనే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యశ్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని, అతని కొత్త కారును స్టేషన్‌కు తరలించారు. కారు టాప్ స్పీడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికే తాను అలా చేశానని నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వేగం సరదా ప్రాణాలకే ప్రమాదమని, రోడ్లపై ఇలాంటి స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *