Bandi Bhageerath: హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో బండి సాయి భగీరథ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ భగీరథ్ అప్పటికే అరెస్ట్ అయినందున, ఇప్పుడు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌కు ఎలాంటి విలువ ఉండదని, దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని భగీరథ్ తరఫు న్యాయవాది హైకోర్టుకు ఒక లేఖ ద్వారా తెలియజేశారు.
ఈ విషయమై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి గురువారం నాడు విచారణ జరిపారు. తమ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని భగీరథ్ తరఫు లాయర్ కోరడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరించారు. పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇస్తూ, ఆ ముందస్తు బెయిల్ దరఖాస్తును పూర్తిగా కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
అయితే, భగీరథ్‌కు హైకోర్టు ఒక చిన్న ఉపశమనం కల్పించింది. నిబంధనల ప్రకారం ఆయన ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు భగీరథ్‌కు అనుమతి ఇస్తూ హైకోర్టు తన ఆదేశాలను జారీ చేసింది.
