Rajya Sabha Elections: దేశంలో ఖాళీ కానున్న ఎగువ సభ స్థానాల భర్తీకి భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. జూన్–జూలై 2026 కాలంలో పదవీకాలం ముగియనున్న మొత్తం 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు.
| ఎన్నికల ప్రక్రియ | తేదీ |
| ఎన్నికల నోటిఫికేషన్ విడుదల | జూన్ 1, 2026 |
| నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ | జూన్ 8, 2026 |
| నామినేషన్ల పరిశీలన | జూన్ 9, 2026 |
| నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ | జూన్ 11, 2026 |
| పోలింగ్ తేదీ (ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు) | జూన్ 18, 2026 |
| ఓట్ల లెక్కింపు (కౌంటింగ్ – సాయంత్రం 5 గంటలకు) | జూన్ 18, 2026 |
| ఎన్నికల ప్రక్రియ ముగింపు | జూన్ 20, 2026 లోపు |
ఆంధ్రప్రదేశ్లో 4 స్థానాలకు ఎన్నికలు:
ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యుల పదవీకాలం జూన్ 21, 2026న ముగియనుంది. పదవీకాలం పూర్తి చేసుకోనున్న ఆ సభ్యులు వీరే:
- అయోధ్య రామిరెడ్డి అల్లా
- పరిమల్ నత్వానీ
- పిల్లి సుభాష్ చంద్రబోస్
- సానా సతీష్ బాబు
ఈసీ కఠిన నిఘా.. ప్రత్యేక పరిశీలకుల నియామకం:
రాజ్యసభ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అత్యంత పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం గట్టి చర్యలు చేపట్టింది. ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పరిశీలకులను (Special Observers) నియమించనున్నట్లు ప్రకటించింది. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
