Air India Flight: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. విమానం రన్‌వేపై దిగుతున్న సమయంలో దాని తోక భాగం (టెయిల్ స్ట్రైక్) నేలకు బలంగా తగిలింది. అయితే, పైలట్లు వెంటనే అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా నిలిపివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 179 మంది క్షేమంగా బయటపడ్డారు.
ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చిన ఎయిరిండియా (AI2651) విమానానికి ల్యాండింగ్ సమయంలో ఈ సాంకేతిక సమస్య ఎదురైనట్లు ఎయిర్ ఇండియా సంస్థ అధికారికంగా ప్రకటించింది. విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న తరుణంలో దాని వెనుక భాగం రన్‌వేను ఢీకొట్టింది. పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి పరిస్థితిని అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై విమానాన్ని పూర్తి తనిఖీల కోసం ప్రత్యేక విభాగానికి తరలించారు. దీంతో ఆ విమానం తిరిగి ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణాన్ని రద్దు చేశారు. ఆ విమానంలో ప్రయాణించాల్సిన వారికి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది. ప్రయాణికులకు జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతూ.. తమకు ప్రయాణికులు, సిబ్బంది భద్రతే అన్నిటికంటే ముఖ్యమని సంస్థ పేర్కొంది.
